పాక్‌ మెరిసింది.. సౌతాఫ్రికా కథ ముగిసింది..!

పాక్‌ మెరిసింది.. సౌతాఫ్రికా కథ ముగిసింది..!

ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే క్రికెట్ కప్ 2019లో సౌతాఫ్రికా జట్టు కథ ముగిసింది... ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పరాజయంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు టోర్నీలో ఐదు ఓటములను చవిచూసిన సౌతాఫ్రికా జట్టు ఇక సాంకేతికంగా కూడా నాకౌట్‌ రేసులో లేదు. ఆఫ్ఘనిస్థాన్ కాకుండా ఇప్పటివరకు సెమీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన ఏకైక  జట్టు సౌతాఫ్రికాయే. ఇక, ఆరు మ్యాచ్‌ల్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న పాకిస్థాన్‌.. సెమీఫైనల్‌ ఆశలు నిలబెట్టుకుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన 49 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. హారిస్‌ సోహైల్‌ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి పాక్ భారీ స్కోర్‌లో కీలక భూమిక పోషించాడు హారిస్. ఇక 309 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓపెనర్‌ ఆమ్లా 2, డికాక్‌ 47 ఔట్ కాగా, మార్‌క్రమ్‌ 7, డసెన్‌ 36, మిల్లర్‌ 31 పరుగులే చేసి ఔట్ అయ్యారు. సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరుగుతూ పోయింది. ఫెలుక్వాయో 46 (నాటౌట్‌) బ్యాట్‌కు పనిచెప్పినా టార్గెట్‌ను అందుకోలేకపోయారు. 9 వికెట్లు కోల్పోయి 259 పరుగుల మాత్రమే చేయగలిగిన ఆ జట్టు 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

పాకిస్థాన్‌ బ్యాటింగ్ : ఇమాముల్‌ 44, జమాన్‌ 44, బాబర్‌ అజామ్‌ 69, హఫీజ్‌ 20, హారిస్‌ సోహైల్‌ 89, ఇమాద్‌ 23, రియాజ్‌ 4, సర్ఫ్‌రాజ్‌ 2 (నాటౌట్‌), షాదాబ్‌ 1 పరుగు చేశారు. 
దక్షిణాఫ్రికా బ్యాటింగ్: ఆమ్లా 2, డికాక్‌ 47, డుప్లెసిస్‌ 63, మార్‌క్రమ్‌ 7, డసెన్‌ 36, మిల్లర్‌ 31, ఫెలుక్వాయో 46 (నాటౌట్‌), మోరిస్‌ 16, రబాడ 3, ఎంగిడి 1, తాహిర్‌ 1 (నాటౌట్‌)