పాకిస్థాన్ డ్రోన్ ను తరిమిన బీఎస్ఎఫ్‌ దళాలు

పాకిస్థాన్ డ్రోన్ ను తరిమిన బీఎస్ఎఫ్‌ దళాలు

పాకిస్ధాన్ బుద్ధి మారడంలేదు. ఓ వైపు శాంతి మంత్రం పఠిస్తూ.. మరోవైపు భారత్ పై ఖయ్యానికి కాలుదువ్వుతోంది. ఇటీవల ఇరుదేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కాస్తా చల్లబడటంతో మళ్లీ దొంగ దెబ్బతీసేందుకు ప్లాన్ చేసింది. తాజాగా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ డ్రోన్ చేసిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్‌ దళాలు తిప్పికొట్టాయి. రాజస్థాన్ సమీపంలో పాకిస్థాన్ డ్రోన్ వచ్చిన విషయాన్ని బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. వెంటనే కాల్పులు జరపడంతో అది పాక్ లోకి తిరిగి వెళ్లిపోయింది.  ఈ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్‌ సమీపంలోని హిందూమల్‌కోట్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఇది భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని బీఎస్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. ఆ వెంటనే దళాలు కాల్పులు జరిపి, దాన్ని వెనక్కి మరలేలా చేశాయి. అంతర్జాతీయ సరిహద్దు గుండా పాక్‌ డ్రోన్‌ భారత్‌లోకి ప్రవేశించడానికి చేసిన మరో ప్రయత్నం ఇది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ దాడుల తర్వాత పాక్ డ్రోన్ ఒకటి గుజరాత్‌లోని కచ్ సరిహద్దు వెంబడి ఉన్న నలియా స్థావరం సమీపంలోకి ప్రవేశించగా సైన్యం దాన్ని కూల్చివేసింది. మార్చి 4 న కూడా రాజస్థాన్‌లోని బికనీర్ సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించగా భద్రతా బలగాలు సుఖోయ్-30 యుద్ధ విమానంతో కూల్చివేశాయి.