11 సంస్థలను నిషేధించిన పాక్ ప్రభుత్వం

11 సంస్థలను నిషేధించిన పాక్ ప్రభుత్వం

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న జమాత్-ఉద్-దవా(జెయుడి), ఫలా-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్), జైషే మొహమ్మద్ (జెఇఎం) లతో సంబంధాలు ఉన్న 11 సంస్థలపై నిషేధం విధిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం శనివారం విడుదల చేసిన అధికార ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, అంతర్గత వ్యవహారాల మంత్రి ఇజాజ్ షా శుక్రవారం జరిపిన భేటీలో ఈ సంస్థలపై నిషేధం వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 

40 మంది భారత భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న ఫిబ్రవరి 14న పుల్వామా దాడికి వ్యూహరచన చేసింది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషేనే అని తెలిసిన తర్వాత పాకిస్థాన్ గడ్డను ఏ ఉగ్రవాద సంస్థ ఇతర దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతించబోమని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. 

తాజాగా నిషేధం విధించిన సంస్థల్లో అల్-అన్ఫాల్ ట్రస్ట్, ఇదారా ఖిద్మత్-ఎ-ఖలఖ్, అల్-దావత్ ఉల్ ఇర్షాద్, మాస్క్స్&వెల్ఫేర్ ట్రస్ట్, అల్-మెదీనా ఫౌండేషన్, మజ్-బిన్-జబెల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, అల్-హమద్ ట్రస్ట్ ఉన్నాయి. ఈ సంస్థలన్నీ లాహోర్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఇవే కాకుండా ఎఫ్ఐఎఫ్ తో సంబంధాలు ఉన్నందుకు లాహోర్ కేంద్రంగా ఉన్న అల్-ఫజల్ ఫౌండేషన్/ట్రస్ట్, అల్-ఎజార్ ఫౌండేషన్లను కూడా నిషేధిస్తున్నట్టు పాకిస్థాన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజమ్ అథారిటీ (నాక్టా) తన వెబ్ సైట్ లో ప్రకటించింది. 

2002లోనే నిషేధించిన జైషే మొహమ్మద్ తో సంబంధాలు కొనసాగిస్తున్నందుకు బహావల్ పూర్ లోని అల్-రెహ్మత్ ట్రస్ట్ ఆర్గనైజేషన్, కరాచీలోని అల్-పుర్ఖాన్ ట్రస్ట్ లను కూడా శుక్రవారం నిషేధించారు.