జైషే మొహమ్మద్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొన్న పాక్ ప్రభుత్వం

జైషే మొహమ్మద్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొన్న పాక్ ప్రభుత్వం

తమ గడ్డపై పురుడు పోసుకొని ఊడలేస్తున్న ఉగ్రవాద సంస్థలకు కళ్లెం వేయాలని పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పాక్ ప్రభుత్వం ఉగ్రవాద గ్రూపులను నియంత్రించేందుకు కదిలింది. పుల్వామా దాడుల నేపథ్యంలో నిన్న ప్రధానమంత్రి కార్యాలయంలో పీఎం ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం పలు చర్యలకు నడుం బిగించింది. వాటిలో భాగంగా ఇవాళ మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మొహమ్మద్ కేంద్ర కార్యాలయాన్ని పాక్ ప్రభుత్వం శుక్రవారం స్వాధీనం చేసుకొంది.

గత వారం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలు బలిగొన్న పుల్వామా దాడికి తమదే బాధ్యత అని ప్రకటించుకొన్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్  కేంద్ర కార్యాలయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం శుక్రవారం నియంత్రణలోకి తీసుకొంది. ‘బహావల్ పూర్ లోని జైషే మొహమ్మద్ కేంద్ర కార్యాలయాన్ని పంజాబ్ ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకున్నట్టు’ పాకిస్థాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌదరీ ప్రకటించారు. ‘బహావల్ పూర్ లోని జైషే మొహమ్మద్ ఆవరణలో ఉన్న మద్రెస్సతుల్ సబీర్, జమా-ఎ-మస్జిబ్ సుభానల్లాలను పంజాబ్ ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకుంది. వీటి కార్యనిర్వహణ కోసం పరిపాలనాధికారి నియమించినట్టు’ ఆయన తెలిపారు.


పుల్వామా దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ప్రధానమంత్రి కార్యాలయంలో నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం తర్వాత ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. పాక్ గడ్డపై పలు ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఇస్లామాబాద్ అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాకిస్థాన్ కీలక మిత్రదేశం చైనా సైతం పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిని కఠిన పదాలతో ఖండిస్తూ జైషే మొహమ్మద్ గురించి ప్రస్తావించడంతో పాక్ చర్యలకు ఉపక్రమించక తప్పలేదు.

జైషే మొహమ్మద్ ఆవరణలోని ఇస్లామిక్ బడులలో ప్రస్తుతం 70 మంది ఉపాధ్యాయులు, 600 మంది విద్యార్థులు ఉన్నట్టు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. పంజాబ్ పోలీసులు ఈ క్యాంపస్ కి భద్రత, రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పింది. నిన్నటి సమావేశంలో ‘ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని’ పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. 26/11 ముంబై దాడుల సూత్రధారి, ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాది హఫీజ్ సయీద్ నాయకత్వంలోని జమాత్-ఉద్-దవా (జెయుడి), దాని అనుబంధ సంస్థ ఫలా-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లపై నిషేధం విధించింది.