మసూద్ ఆస్తుల జప్తు, ట్రావెల్ బ్యాన్ ఆదేశాలిచ్చిన పాక్

మసూద్ ఆస్తుల జప్తు, ట్రావెల్ బ్యాన్ ఆదేశాలిచ్చిన పాక్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బుధవారం జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. మర్నాడే పాకిస్థాన్ మసూద్ అజహర్ స్థిర, చరాస్తులను జప్తు చేసి దేశం లోపల-బయట తిరగకుండా ఆంక్షలు విధిస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. 

బుధవారం జారీ అయిన ఉత్తర్వుల్లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ అజహర్ మసూద్ కి వ్యతిరేకంగా రెజొల్యూషన్ 2368 (2017)ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశాలివ్వడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంది. ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా మసూద్ అజహర్ పై ఆంక్షలను అమలు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 

మసూద్ అజహర్ పై ఆయుధాల కొనుగోలు, అమ్మకాలపై కూడా ఆంక్షలు విధించడం జరిగింది. పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ బుధవారం మాట్లాడుతూ పాకిస్థాన్ అజహర్ పై విధించిన ఆంక్షలను వెంటనే అమలు చేస్తుందని చెప్పారు. ఇది భారత్ కు దౌత్యపరంగా అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు.

పాకిస్థాన్ లో నివసిస్తున్న మసూద్ అజహర్ ని ఐక్యరాజ్యసమితి ఎట్టకేలకు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతకు ముందు చైనా అజహర్ ను బ్లాక్ లిస్ట్ చేయాలన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ల ప్రతిపాదనలకు టెక్నికల్ హోల్డ్ ఉపయోగించి మోకాలడ్డుతూ వచ్చింది. చైనా వరుసగా మూడు సార్లు మసూద్ ను రక్షించింది. కానీ ఈ సారి మసూద్ కి వ్యతిరేకంగా ఏర్పడిన వాతావరణాన్ని గమనించిన చైనా కూడా మెత్తపడక తప్పలేదు.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1267 అల్ ఖైదా ఆంక్షల జాబితాలో మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫిబ్రవరిలో ప్రతిపాదన ప్రవేశపెట్టాయి. జైష్ ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రవాద దాడి జరిపింది. ఇందులో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.