దాడికి దిగితే కొరివతో తలగోక్కున్నట్లే

దాడికి దిగితే కొరివతో తలగోక్కున్నట్లే

మాతో పెట్టుకోవద్దు. దాడికి దిగితే కొరివతో తలగోక్కున్నట్లే అంటూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఆర్మీ చీఫ్ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా నియంత్రణ రేఖ సమీపంలోని సైనిక స్థావరాలను సందర్శించారు. ఈ సందర్భంగా భారత్ ను ఆయన హెచ్చరించారు. మీరు గనక దుస్సాహసానికి దిగితే పూర్తి శక్తితో ప్రతిఘటిస్తామని అన్నారు. త్వరలో మరిన్ని బలగాలను ఎల్‌ఓసీకి పంపుతామని చెబుతూ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అవసరమైతే అఫ్గాన్‌ సరిహద్దుల నుంచి బలగాలను భారత సరిహద్దులవైపు తరలించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. 
 
పుల్వామా ఉగ్ర దాడి అనంతరం సరిహద్దుల్లో భారత సైన్యం హైఅలర్ట్ ప్రకటించింది. భారత జవాన్లపై ఆత్మాహుతి దాడి చేసిన ఘటనపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆర్మీతోపాటు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్ సరిహద్దుల్లోని 27 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి ప్రత్యేక శిబిరాలకు తరలిరావాలని సైనికాధికారులు నోటీసులు జారీ చేశారు.