పుల్వామా దాడిలో జైషే హస్తంపై మరిన్ని ఆధారాలు కోరిన పాక్

పుల్వామా దాడిలో జైషే హస్తంపై మరిన్ని ఆధారాలు కోరిన పాక్

పుల్వామా దాడిలో జైషే హస్తం ఉందనేందుకు మరిన్ని ఆధారాలు ఇవ్వాలని పాకిస్థాన్ భారత్ ను కోరింది. పాకిస్థాన్ లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టు రుజువులు ఇవ్వాలని ఇస్లామాబాద్ లోని భారత హైకమిషనర్ కు పాకిస్థాన్ తెలిపింది. ఉగ్రవాద సంస్థలపై చర్యల ప్రక్రియను కొనసాగించేందుకు భారత్ నుంచి మరింత సమాచారం కోరినట్టు పాకిస్థాన్ చెప్పింది. 

భారత హైకమిషనర్ ను విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి పిలిచారు. పుల్వామా దాడికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ భారత హైకమిషనర్ కు వివరించింది. భారత్ ఇచ్చిన ఫైల్ పరిశీలించిన తర్వాత ఈ వివరాలను అందజేయడం జరిగింది. ఫిబ్రవరి 27న భారత్ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్ కు పుల్వామా దాడికి సంబంధించిన డోజియర్ అందజేసింది. దాడి వెనుక జైషే హస్తం ఉందనేందుకు గట్టి ఆధారాలను భారత్ పాకిస్థాన్ కు ఇచ్చింది. ఇవే కాకుండా పాక్ లో జైషే శిబిరాలు, వాటి నాయకుల ఆనుపానుల గురించి సాక్ష్యాధారాలను భారత్ చూపించింది.

గూఢచార వర్గాల ప్రకారం పుల్వామాలో ఫిదాయీ దాడి తర్వాత పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను సేఫ్ జోన్ లో దాచి పెట్టింది. అజహర్ ని ఫిబ్రవరి 17-18 అంటే పుల్వామా దాడి తర్వాత రావల్పిండి నుంచి బహావల్ పూర్ దగ్గరలోని కోట్ ఘానీకి పంపించారు. ఐఎస్ఐ అతని భద్రతను పెంచింది. పుల్వామాలో దాడి జరిగిన సమయంలో అజహర్ రావల్పిండిలో సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. 

పుల్వామా దాడి, భారత్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిపోయింది. దీని తర్వాత పాక్ ప్రభుత్వం జమాత్-ఉద్-దవా, ఫలా-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్ ముఖ్య కార్యాలయాలను అధీనంలోకి తీసుకోవడంతో పాటు నిషేధిత సంస్థలకు చెందిన 100 మందికి పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. 182 మదర్సాలను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకుంది.