పాక్‌తో నేడు భారత్‌ ఢీ..  తీవ్ర ఉత్కంఠ

పాక్‌తో నేడు భారత్‌ ఢీ..  తీవ్ర ఉత్కంఠ

అసలుసిసలైన క్రికెట్‌ మజాకు సర్వం సిద్ధమైంది. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా చూసే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ ఇవాళే జరగనుంది. వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుణుడు కరుణిస్తే నరాలు తెగే ఉత్కంఠ సన్నివేశాలకు.. ఉద్వేగ భరిత దృశ్యాలకు ఖాయమే అంటున్నారు అభిమానులు.

జట్ల కూర్పు విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్, పేస్ బౌలింగ్, ఆల్‌రౌండర్ల కాంబినేషన్‌తో భారత్‌ బలంగా కనిపిస్తోంది. గాయం కారణంగా ధావన్‌ తప్పుకోవడంతో అతని స్థానంలో సీనియర్ దినేశ్ కార్తీక్‌కు అవకాశం దక్కుతుంతో లేదా ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్‌ను ఆడిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ, రోహిత్‌తోపాటు  ధోనీ, హార్దిక్ పాండ్యా ఫామ్‌లో ఉండటం టీమిండియాకు ప్లస్ పాయింట్‌. బుమ్రాతోపాటు భువనేశ్వర్‌, షమిల్లో ఎవరికి స్థానం దక్కినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే పాక్‌ బ్యాటింగ్‌ను దెబ్బ తీయడం చాలా సులభం.

ఇక.. ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌లో భారత్‌ను బోల్తా కొట్టించలేకపోయిన పాక్.. ఈ సారైనా తమ చెత్త రికార్డును సరిచేయాలని ఆశిస్తోంది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌లో ఇమామ్‌ ఉల్‌ హఖ్, బాబర్‌ ఆజమ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. కొత్త పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిదితోపాటు స్టార్‌ బౌలర్‌ ఆమిర్‌లపై ఆ జట్టు బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ను ఓడించిన పాక్‌.. ఇవాళ భారత్‌పై విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.