వరల్డ్‌ కప్‌: విండీస్‌ చేతిలో పాక్‌ చిత్తు

వరల్డ్‌ కప్‌: విండీస్‌ చేతిలో పాక్‌ చిత్తు

వరల్డ్‌ కప్‌ను వెస్టిండీస్‌ విజయంతో ప్రారంభించింది. ఇవాళ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. 36.2 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 21.4 ఓవర్లలో కేవలం 105 పరుగులకే పాకిస్థాన్‌ ఆలౌటైంది. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 2 పరుగులకే ఔటయ్యాడు. మంచి జోరు మీద కనిపించిన మరో ఓపెనర్‌ జమన్‌(22: 16 బంతుల్లో 2x4, 1x6).. ఆండ్రీ రసెల్‌ వేసిన ఆరో ఓవర్‌ ఐదో బంతికి బౌల్డయ్యాడు. ఆ తర్వాత  హ్యారిస్‌ సోహైల్‌(8),  బాబర్‌ ఆజామ్‌ (22: 33 బంతుల్లో 2x4) కూడా వెంటవెంటనే అవుటవడంతో పాక్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (8) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వెనువెంటనే ఇమాద్‌ వసీమ్‌ (1), షాబాద్‌ ఖాన్‌ (0) అవుటయ్యారు. హఫీజ్‌ కూడా 16 పరుగులకు వెనుదిరిగాడు. చివర్లో రియాజ్‌ (18) రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాది స్కోరును 100 దాటించాడు. ఈక్రమంలో థామస్‌ వేసిన 22వ ఓవర్‌ నాలుగో బంతికి రియాజ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. హోల్డర్‌, థామస్‌ 4, హోల్డర్‌ 3, రసెల్ 2, కాట్రెల్‌ 1 వికెట్‌ పడగొట్టారు.

106 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన విండీస్ జట్టులో ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ ఆరంభం నుంచే బౌండరీలతో బెంబేలెత్తించాడు. నాలుగో ఓవర్‌లో  హసన్‌ అలీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. మరో ఓపెనర్‌ హోప్‌..  భారీ షాట్‌ ఆడబోయి అమీర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన బ్రావో.. అమీర్‌ బౌలింగ్‌లోనే డకౌట్‌ అయ్యాడు. ఈ దశలో గేల్‌ చెలరేగాడు. 3 సిక్సర్లు, 6 ఫోర్లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అదే స్కోరు వద్ద అమీర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో పూరన్‌  (28; 17 బంతుల్లో 4x4, 1x6), హిట్‌మెయిర్‌లు మిగిలిన పరుగుల చేసి జట్టుకు విజయాన్నందించారు.