పాండ్యా, రాహుల్ లకు మునివేళ్లపై దెబ్బ పడాలి

కాఫీ విత్ కరణ్ టాక్ షోలో హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేయడంపై టీమిండియా క్రికెట్ కోచ్ రవిశాస్త్రి నోరు విప్పాడు. వారిద్దరికి మునివేళ్లపై గట్టి దెబ్బ పడాలని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ బోర్డుకి చెందిన పాలకుల మండలి(సీఓఏ) ఒక టాక్ షోలో కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై దర్యాప్తునకు కొత్తగా ఆంబుడ్స్ మన్ ను నియమించిన వారం తర్వాత రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

‘పాండ్యా, రాహుల్ లకు మునివేళ్లపై గట్టి దెబ్బ పడాలి. జరిగిన దాంతో వాళ్లు చాలా నేర్చుకుని ఉంటారు. ఇదీ వాళ్ల మంచికేనని‘ మిర్రర్ నౌతో మాట్లాడుతూ రవిశాస్త్రి అన్నాడు. ‘మీరు తప్పకుండా తప్పులు చేస్తారు. అందుకు అప్పుడప్పుడు తప్పనిసరిగా శిక్ష పడుతుండాలి. కానీ దాంతో ప్రపంచం ఏం అంతమైపోదు. అలాంటి అనుభవాలతో ఆటగాళ్లు రాటుదేలి మరింత బలంగా, తెలివిగా తయారవుతారని‘ చెప్పాడు.

కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షో కాఫీ విత్ కరణ్ లో ఇద్దరు యువక్రికెటర్లు వాళ్లు చేసిన వ్యాఖ్యలకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జట్టు నుంచి సస్పెండయ్యారు. వారి సస్పెన్షన్ చివరకు ఎత్తేయడం జరిగింది. జనవరి 6న ప్రసారమైన కార్యక్రమంలో క్రికెటర్లు తమ వ్యక్తిగత జీవితం సహా వివిధ విషయాలపై మాట్లాడారు. ఆ ఎపిసోడ్ ని అన్ని ఆన్ లైన్ మాధ్యమాల నుంచి తొలగించడం జరిగింది. జరిగిన దానికి పాండ్యా, రాహుల్ క్షమాపణలు కోరారు.