రైళ్లలో మహిళల భద్రత కోసం "బటన్"

రైళ్లలో మహిళల భద్రత కోసం "బటన్"

మహిళల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రైళ్లలో అబలలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌‌లు నానాటికీ పెరిగిపోతున్నాయి. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే ఆడవారిపై జరిగే దాడులకు ఇక అంతే ఉండటం లేదని గణాంకాలు చెబుతున్నాయి. కొద్దిరోజుల క్రితం సమావేశమైన రైల్వే బోర్డు మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.. ఈ కమిటీ కొన్ని సిఫారసులను బోర్డుకు ప్రతిపాదించింది.

దీనిలో భాగంగా రైలు చివరిలో ఉన్న మహిళా బోగీని.. రైలు మధ్య భాగంలో వుంచాలని.. అంతేకాకుండా... ఆ బోగీలలో సీసీటీవీ కెమెరాలు, కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ కొత్తగా ఓ ప్రయాగం చేయదలచింది. ఇప్పటి వరకు రాత్రి వేళల్లో డ్యూటీలు చేసే మగవారి స్థానంలో.. మహిళా కానిస్టేబుళ్లను నియమించనుంది. అలాగే అన్ని కోచ్‌ల్లోనూ ఒక ఎమర్జెన్సీ బటన్‌ను బిగించనుంది. ఇది రైల్ కోచ్ గార్డ్‌ ఉండే బోగికీ అనుసంధానించి ఉంటుంది..

అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికులు దీనిని గట్టిగా నొక్కితే.. కోచ్ గార్డ్, విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను అప్రమత్తం చేస్తారు. అయితే మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను భర్తీ చేసుకున్న తర్వాత ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇది విజయవంతం అయితే దేశవ్యాప్తంగా అన్ని జోన్లలోనూ ఈ అత్యవసర బటన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.