వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే..

వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే..

తెలుగుదేశం పార్టీని వీడుతున్నారంటూ వచ్చిన వార్తలను ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఖండించారు... తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరి.. తనకు తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్‌ ఇచ్చిందన్న ఆయన... ఏ పార్టీకి చెందిన వ్యక్తులతోనూ తాను సంప్రదింపులు జరపలేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను రాజకీయ నాయకుడిగా కంటే.. కుటుంబసభ్యుడిగానే చూశారని అన్నారు ఏలూరి సాంబశివరావు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపనులు వాళ్లు చేసుకుంటారనే ఉద్దేశంతోనే కొన్ని కార్యక్రమాలకు తాను దూరంగా ఉన్నట్టు ఆయన వివరించారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా వచ్చిన వార్తలు ఖండిస్తున్నాన్న ఆయన.. ఇలాంటి వార్తలకు ఇకనైనా పులిస్టాప్ పెట్టాలని కోరారు. కాగా, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి... అందులో ప్రముఖంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేరు కూడా వినిపించింది.. మొత్తానికి నాకు తెలుగు దేశం పార్టీని వీడే ఆలోచన లేదు.. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తులతో సంప్రదింపులు జరపలేదు. నాకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే... అందులోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు.