రివ్యూ : పరిచయం

రివ్యూ : పరిచయం

నటీనటులు: విరాట్‌, సిమ్రత్‌ కౌర్‌, రాజీవ్‌ కనకాల, పృథ్వీ, సిజ్జు, పరుచూరి వెంకటేశ్వరరావు. 

మ్యూజిక్: శేఖర్‌ చంద్ర

ఫోటోగ్రఫీ: నరేష్‌ రాణా

నిర్మాత: రియాజ్‌

దర్శకత్వం: ల‌క్ష్మీకాంత్ చెన్నా

రిలీజ్ డేట్: 21-07-2018

టాలీవుడ్ లో లక్ష్మీకాంత్ చెన్నా పేరు పరిచయం ఉన్నదే.  హైదరాబాద్ నవాబ్స్, నిన్నా నేడు రేపు అనే చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన లక్ష్మీకాంత్ చాలా కాలం తరువాత, పరిచయం సినిమాను తెరకెక్కించారు.  అన్ని సినిమాల్లో కనిపించే ఆకతాయి తనం, అల్లరి, ప్రేమ విషయంలో బాధ్యతారాహిత్యం వంటివి పరిచయం సినిమాలో ఉండవని చెప్పిన లక్ష్మీకాంత్.. అలాంటి విషయాలు ఏమి లేకుండా.. స్వచ్ఛమైన ప్రేమ కథను ఎలా తెరకెక్కించారు ఇప్పుడు చూద్దాం. 

కథ : 

విరాట్, సిమ్రత్ కౌర్ లు ఒకే రోజున, ఒకే హాస్పిటల్ లో, ఒకే సమయంలో జన్మిస్తారు. ఇలా ఒకే సమయంలో జన్మించిన ఈ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకరంటే  ఒకరికి అభిమానం ఉంటుంది.  కాలేజీలో చదువుకునే సమయంలో కూడా మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టరు. ఒకరోజు తమ మనసులోని ప్రేమను చెప్పాలనుకునేలోపే పెద్దలు అడ్డుపడతారు.  దీంతో  సిమ్రత్ ఆత్మహత్యాయత్నం చేస్తుంది.  దీంతో గతం మర్చిపోతుంది.  గతం మర్చిపోయిన  సిమ్రత్ ను హాస్పిటల్ లోనే వదిలేసి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. ఆ సమయంలో విరాట్ సిమ్రత్ కు అండగా ఉంటాడు.  అన్ని తానై ఆమెను కాపాడతాడు.  మరి  సిమ్రత్ కు గతం గుర్తుకు వచ్చిందా..? తిరిగి ఇద్దరు కలిశారా అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

హీరోయిన్ గతం మర్చిపోతే.. ఆమెకు సేవ చేస్తూ.. గతం గుర్తుకు వచ్చేలా చేయడం వంటి కథలతో గతంలో సినిమాలు వచ్చాయి.  ఉదాహరణకు వసంత కోకిల. వసంత కోకిల సినిమాను స్ఫూర్తిగా తీసుకొని కథ రాసుకున్నట్టుగా ఉన్నది.  పాత సినిమాల కథలను తిరిగి పరిచయం చేసినట్టుగా ఉన్నది.  ఇలాంటి సినిమాల కథలు నవలలో చదువుకోవడానికి బాగుంటాయి.  తెరపై చూడాలి అంటే  కొంచెం కష్టమే.  అందరికి నచ్చే విధంగా, ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా సన్నివేశాలను తయారుచేసుకోవాలి.  అలాంటి బలమైన, బరువైన సన్నివేశాలు ఈ సినిమాలో కనిపించలేదు.  ఫస్టాఫ్ అంతా హీరో హీరోయిన్ల ప్రేమ కథ చుట్టూనే సినిమా తిరుగుతుంది.  సెకండ్ హాఫ్ లో ఎమోషన్ తో నడిపిద్దామని అనుకున్నా.. కుదరలేదు.  ప్రేమకథా సినిమాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా హాస్యం ఉంటుంది.  ఈ సినిమాలో హాస్య సన్నివేశాలు లేకపోవడం పెద్ద మైనస్ అయింది. పెద్దలకు ప్రేమ అంటే ఎందుకంత వ్యతిరేకమో అర్ధం కాలేదు.  ఆ కోపానికి కారణాలు ఏవి ఇందులో చూపించలేదు.  హీరోయిన్ గతం కోల్పోయి పిచ్చిదానిలా హాస్పిటల్ లో ఉంటె తండ్రి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది.  ఎందుకు అలా వదిలి వెళ్లిపోయాడో అర్ధం కాలేదు.  సినిమాను ప్రారంభించిన విధానం బాగున్నా.. ఆ బిగుతును, ఉత్కంఠతను కొనసాగించలేకపోయాడు.  ఒకానొక సమయంలో ముగింపు ట్రాజెడీగా మారుస్తాడా అనిపిస్తుంది.  చివరకు హీరో హీరోయిన్లకు కలిపి కథను సుకాంతం చేశాడు.  

నటీనటుల పనితీరు : 

హీరో హీరోయిన్లుగా చేసిన విరాట్, సిమ్రత్ కౌర్ లు ఇద్దరు కొత్తవారే.  కొత్తవారైనా వారి పరిధిమేరకు మెప్పించారు.  ఎమోషన్ సీన్స్ లో హీరో విరాట్ మెప్పించాడు.  రాజీవ్ కనకాల, పృథ్వి లు తప్పా మిగతా వారంతా కొత్తవారే.  మిగతా పాత్రలలో ఎవరికి తగ్గట్టుగా వారు మెప్పించే ప్రయత్నం చేశారు.  

సాంకేతికం : 

దర్శకుడు బిగుతైన కథనాలు రాసుకొని ఉంటె బాగుండేది.  కొన్ని చోట్ల మెప్పించిన దర్శకుడు కొన్ని సీన్స్ ను సాగదీసి బోర్ కొట్టించాడు.  ముఖ్యంగా అరకు సీన్స్.  శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది.   వినసొంపుగా ఉన్నాయి.  సాంగ్స్ చిత్రీకరణ బాగుంది.  దర్శకుడు సాంగ్స్ పై పెట్టిన దృష్టి, కథపై కూడా పెట్టి ఉంటె రిజల్ట్ మరోలా ఉండేది.  

పాజిటివ్ పాయింట్స్ : 

ఫోటోగ్రఫి 

సంగీతం 

పాటలు 

మైనస్ పాయింట్స్ : 

కథ 

కథనాలు 

సాగదీసిన సన్నివేశాలు 

చివరిగా : పాత కథనే మరలా "పరిచయం" చేశాడు.