దిశ ఘటన మీద పార్లమెంట్‌లో చర్చ

దిశ ఘటన మీద పార్లమెంట్‌లో చర్చ

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దిశ రేప్‌ ఘటనపై చర్చించాలని లోక్ సభలో విపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా జీరో అవర్‌ లో చర్చిద్దామని సభ్యులకు తెలిపారు. దీంతో క్వశ్చన్‌ అవర్‌ను రద్దు చేసి వెంటనే దిశ రేప్‌ ఘటనపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. మరోపక్క దిశ ఘటనపై ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. నల్ల రిబ్బన్లతో  ధర్నాలో పాల్గొంటున్నారు. నిందితులను బహిరంగంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దిశ ఘటన మీద రాజ్యసభలో చర్చ జరుగుతోంది.

దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై దాడుల వంటి సమస్యలను మూలాల నుంచి తొలగించడాని సమాజం నిలబడాలని వ్యాఖ్యానించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు. దిశ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా సామాజిక సంస్కరణ జరగాలని దేశంలోని న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను తాను కోరుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అమీ యజ్ఞిక్ అన్నారు.