కమిన్స్ అద్భుత త్రో.. పుజారా అవుట్

కమిన్స్ అద్భుత త్రో.. పుజారా అవుట్

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ పుజారా (123; 246 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11).. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) త్వరగానే  పెవిలియన్ చేరారు. ఈ సమయంలో రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్ (25), అశ్విన్ (25)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. చివరలో టీమిండియా బ్యాట్స్ మెన్స్ అందరూ పెవిలియన్ చేరినా.. బౌలర్ల అండతో స్కోర్ ను ముందుకు సాగిస్తూ ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు పుజారా వికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో పేస్ బౌలర్ పాట్ కమిన్స్ అద్భుతం చేసాడు.

ఆసీస్ పేస్ బౌలర్ హేజిల్ వుడ్ వేసిన బంతిని పుజారా లెగ్ సైడ్ మీదుగా షాట్ ఆడాడు. సర్కిల్ లో ఫీల్డింగ్ చేస్తున్న పాట్ కమిన్స్ బంతిని అందుకుని డైవ్ చేస్తూ వికెట్ల మీదికి విసిరాడు. బంతి కాస్తా నేరుగా వికెట్లను తాగింది. దీంతో పుజారా రనౌట్‌ అయ్యాడు. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. ఈ రనౌట్‌ కి సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.