జనసేన మేనిఫెస్టో..

జనసేన మేనిఫెస్టో..

జనసేన ఆవిర్భావ దినోత్సవ బహిరంగసభ వేదికగా 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... రాజమండ్రిలో ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన... జనసేన ఐదో ఆవిర్భావ సభలో.. పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ప్రకటించారు. జనసేన మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులపై వరాల జల్లు కురిపించారు. ఎకరాకు రూ.8వేల పంటల పెట్టుబడి సాయంతో పాటు 60 ఏళ్లు పైబడిన సన్న, చిన్నకారు రైతులకు రూ.5వేల పింఛను అందిస్తామని ప్రకటించారు జనసేనాని... రైతులకు ఉచితంగా సోలార్‌ మోటార్లు అందజేస్తామని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. యువత, మహిళలకు భరోసా కల్పిస్తూ హామీలు ఇచ్చారు. జనసేన అధికారంలోకి వచ్చిన తొలి ఆరునెలల్లో లక్ష ఉద్యోగాలు.. ఐదేళ్లలో 10లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ప్రకటించారు పవన్ కల్యాణ్... వేదికపై పవన్ మేనిఫెస్టో ప్రకటిస్తున్న సమయంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. 

ఆవిర్భావ దినోత్సవ వేదికగా పవన్ ఇచ్చిన హామీలు:
- డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం
- ప్రభుత్వోద్యోగుల కోసం సీపీఎస్‌ రద్దు
- బీసీలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లు
- ముస్లింల అభ్యున్నతికి సచార్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు
- ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు
- నదులు అనుసంధానం చేసి కొత్త జలాశయాలు నిర్మాణం
- మత్స్యకారుల రుణాల కోసం ప్రత్యేక బ్యాంకు. 
- మత్స్యకారులు వేటకు వెళ్లని సమయంలో రోజుకు రూ.500ఆర్థిక సహాయం
- అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపు అందరికీ రక్షిత మంచినీటి సరఫరా
- అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం
- స్త్రీలకు అండగా ఉండే, భద్రత కల్పించేలా కఠిన చట్టాల రూపకల్పన
- ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు, ఆస్పత్రి నిర్మాణం
- మహిళలకు శాసనసభలో 33శాతం రిజర్వేషన్లు 
- డ్వాక్రా సంఘాల మహిళలకు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
- ఆడపడుచులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు
- అన్ని మతాల మహిళలకు ఆయా పండుగలకు చీరల పంపిణీ  
- మహిళా ఉద్యోగుల కోసం శిశు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు
- ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు రెండింతలు
- ఎవరూ లంచం అడగని వ్యవస్థను సృష్టిస్తాం