పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జనసేనాని..

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జనసేనాని..

సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని, కానిస్టేబుల్‌ ఇంట్లో పుట్టిన ఓ వ్యక్తి 2019లో సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. గెలుపోటములు తెలియదు... యుద్ధం చేయడమే తనకు తెలుసన్న పవన్... సీఎం పదవిపై తనకు కోరిక లేదని, అందలం ఎక్కాలని ఆశ లేదని చెప్పారు. పవర్‌స్టార్‌ అనే పదంపైనే ఆసక్తి లేదన్న జనసేనాని.. సీఎం పదవిపై ఉంటుందా? అని ప్రశ్నించారు. అన్యాయంపై గళమెత్తేందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. డబ్బుంటే చాలు గెలవొచ్చనే పరిస్థితుల్లో ఉన్నామని, డబ్బు, పేరు తనకు ఎప్పుడూ ఆనందం ఇవ్వలేదన్నారు. మనిషికి అన్యాయం జరుగుతుంటే వర్గీకరించి చూడలేనన్నారు. జనసేనను స్థాపించినప్పుడు నేనెక్కడినే... ఇప్పుడు సైన్యం ఉంది. తెలుగు ప్రజల సుస్థిరత కోసమే గతంలో బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చానని గుర్తుచేసుకున్నారు. అడుగేస్తే తలతెగాలి కానీ... వెనుకడుగు వేయన్న పవన్.. నాలుగేళ్లుగా ఎంత తిట్టినా, బెదిరించినా వెనక్కి తగ్గలేదు. వేల కోట్ల రూపాయలు ఉంటేనే రాజకీయాల్లో రావాలా? అని ప్రశ్నించారు. టీనేజీ యువతే నీ దగ్గర ఉంది... ఎలా గెలుస్తావని కొందరు ప్రశ్నించారన్న పవన్... రాజకీయాల్లో నాకు శత్రులెవరూ లేరన్నారు. వైసీపీ అధినేత జగన్‌ విధానాలను ప్రశ్నిస్తే... నాపై వ్యక్తిగత దాడి చేస్తున్నారని విమర్శించిన జనసేనాని... నేనేం తప్పు చేశాను.. ప్రశ్నించడం తప్పా? అన్నారు.