నేడు నెల్లూరుకు పవన్‌ కళ్యాణ్‌

నేడు నెల్లూరుకు పవన్‌ కళ్యాణ్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మొత్తం మూడు సభల్లో పాల్గొని పవన్ ప్రసంగించనున్నారు. మొదటగా విజయవాడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు హెలికాఫ్టర్‌లో చేరుకొని.. అక్కడ నుంచి రోడ్డు మార్గాన మినీబైపాస్‌ రోడ్డులోని జీపీఆర్‌ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి (ఉదయం 10 గంటలకు) చేరుకుంటారు. జనసేన నెల్లూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కేతంరెడ్డి వినోద్‌రెడ్డిని ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు.

ఆ తర్వాత 12 గంటలకు కోవూరులోని పట్టపుపాళెం, స్టవ్‌బీడీ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకు కావలి సమీపంలోని బిట్రగుంట, చెంచులక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సభల్లో జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియచేస్తారు, జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ ప్రజలను కోరనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉంది కనుక పోలీసులు భారీ ఏర్పాట్లు చేసారు.