జన్మభూమి కమిటీలను తరిమి తరిమి కొడతారు...

జన్మభూమి కమిటీలను తరిమి తరిమి కొడతారు...

జన్మభూమి కమిటీలు ప్రజల్ని దోపిడీ చేస్తున్నాయి... ఆ కమిటీలను యువత, మహిళలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... అర్హులైన బీసీ యువతకు రుణం కావాలంటే తెలుగుదేశం పార్టీ జెండా మోయాలా? ఎవడబ్బ సొమ్మది? అంటూ మండిపడ్డారు. పుష్కరాల పేరుతో రెండు వేల కోట్లు ఖర్చుపెట్టారు... ఎక్కడ ఖర్చుపెట్టారో త్వరలో గోదావరి జిల్లా పర్యటనలో తేలుస్తా? నని హెచ్చరించారు. మత్స్యకారులు ఈ సందర్భంగా వలలు ఇవ్వడంపై స్పందించిన పవ్... మత్స్యకారులు నాకిచ్చిన ఆ వలలో తెలుగుదేశం అవినీతి చేపలు పడాలంటూ వ్యాఖ్యానించారు. 

2014లో చంద్రబాబుకి ఏమీ ఆశించకుండా మద్దతు ఇచ్చా... కానీ, 2019లో అనుమానం లేకుండా జనసేన ప్రభుత్వం స్థాపిస్తామని స్పష్టం చేశారు పవన్... ఉత్తరాంధ్రలో కీలకమైన చెరకు పంటకు ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని విమర్శించిన ఆయన... ప్రైవేటు లాభాల కోసం కో-ఆపరేటివ్ వ్యవస్థలను చంపేస్తున్నారని మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు లేక చిన్న కమతాలను అమ్మేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్... రైతుల గళం వినిపించడానికి జనసేన ముందుకు వచ్చింది... ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే సినిమాలు విడిచిపెట్టానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ మార్పు రాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్.