జనసేనానితో బీజేపీ జాతీయ నేత కీలక చర్చలు..!

జనసేనానితో బీజేపీ జాతీయ నేత కీలక చర్చలు..!

22వ తానా మహాసభల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి... ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వాషింగ్టన్ డీసీకి వెళ్లగా... ఇక మహాసభలకు హాజరైన బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి రామ్‌మాధవ్‌తో ఆయనతో రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. వీరి మధ్య తాజా రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయని సమాచారం. రాష్ట్ర విభజన హామీల అమలు, ఇతర అంశాలపై సమాలోచనలు జరిపారు ఇద్దరు నేతలు. రాష్ట్ర విభజనతో లోటుబడ్జెట్‌లోకి వెళ్లిపోయిన ఏపీకి కేంద్రం చేయాల్సిన సాయం, రాష్ట్రానికి ఏం చేస్తే మంచిదనేదానిపై మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఏపీ టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పనిచేసిన పవన్ కల్యాణ్... ఆ తర్వాత క్రమంగా వారికి దూరమయ్యారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్‌పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల నేతలను కమలం గూటికి ఆహ్వానిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ బలంగా జరుగుతోందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్-రాంమాధవ్ భేటీ చర్చకు దారితీసింది.