పవన్ ఆదేశించారు..! రాపాక పాటిస్తాడా..?

పవన్ ఆదేశించారు..! రాపాక పాటిస్తాడా..?

ఓవైపు రాజధానులపై అసెంబ్లీలో కీలక చర్చ సాగుతోంది.. మూడు రాజధానులపై వచ్చిన ప్రతిపాదలను పరిశీలించిన ఏపీ కేబినెట్.. వాటికి అమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దానికి అనుగుణంగా.. మూడు రాజధానులపై అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అయితే, ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు కీలక ఆదేశాలు జారీ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగించాలని పార్టీలోని వివిధ స్థాయిల్లో జరిగిన సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని లేఖలో పేర్కొన్న పవన్... ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.. రాజధాని నిర్మాణం అమరావతిలోనే కొనసాగాలని, ప్రభుత్వ పాలన సంపూర్ణంగా అమరావతి నుంచే కొనసాగాలని, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధిచెందాలన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. అయితే, ఈ రోజు జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లో.. ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లు.. బిల్లులు అసెంబ్లీ ముందుకు వస్తున్న సంగతి మీకు తెలిసిన విషయమేనని పేర్కొన్న జనసేనాని... పార్టీ నిర్ణయానుసారం మీరు శాసనసభకు హాజరై.. పై రెండు బిల్లులను ప్రవేశపెట్టే సమయంలోనూ, ఓటింగ్‌లోనూ వ్యతిరేకించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. అయితే, గతంలో ప్రభుత్వ నిర్ణయాలను అసెంబ్లీ వేదికగా మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే రాపాక... ఇప్పుడు కీలకమైన బిల్లు విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? పవన్ ఆదేశాలను పాటిస్తారా? పట్టించుకోకుండా వైసీపీ సర్కార్ తెచ్చిన బిల్లుకు సపోర్ట్ చేస్తారా? అనే చర్చ మాత్రం హాట్‌హాట్‌గా సాగుతోంది.