పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు... మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ కల్యాణ్.. జనసేన పార్టీని తమ పార్టీలో కలిపేయాలంటూ ఒక పెద్ద పార్టీ నుంచి ఒత్తిడి వస్తోందని.. అయితే, జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసేది లేదని.. తలపై తుపాకులు పెట్టినా జనసేన పార్టీని ఏ పార్టీలో కలపబోమని స్పష్టం చేశారు. జాతి సమగ్రతని కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని.. అందుకే జనసేనను ఏ పార్టీలోనూ కలపబోనని తేల్చేశారు పవన్.. భావజాలాన్ని అర్థంచేసుకున్నవాళ్లతో పార్టీ నడుపుతా... అధికారం కోసం కాదు ప్రజల కోసం పట్టుపడతానని మరోసారి గర్జించారు పవన్. 

తాను సత్యం కోసం పనిచేసేవాడినని, ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలని కోరిన పవన్ కల్యాణ్... అలా కాకుండా రోడ్ మీదకు వెళ్లి, సోషల్ మీడియాలో చెప్తే వినటానికి ఇదేం కాంగ్రెస్ పార్టీ కాదని నేతలు, కార్యకర్తలకు హితవు పలికారు. రాజకీయాల్లో మాట నియంత్రణ అవసరం.. సోషల్ మీడియా అనే అద్భుతమైన వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దన్నారు పవన్. నా బలం నాకు తెలుసు.. నా బలహీనత నాకు తెలుసన్న ఆయన.. జనసైనికులు అంతా వరదబాధితులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో అభిమానుల అత్యుత్సాహంపై స్పందించిన పవన్.. మీతో కలిసి ఫోటోలు దిగటానికి ఇబ్బందేమీ లేదు. అయితే ఒకేసారి అందరూ మీద పడిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతోందన్నారు. మీ ప్రేమతో నన్ను బందీని చేయొద్దు.. ప్రజా సమస్యలను తెలుసుకోనివ్వండి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్.

టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో.. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం, మరో పార్టీ తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చుకుని ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యాలతో ఆవిర్భవిస్తే.. జనసేన పార్టీ జాతి కోసం ఆవిర్భవించిందన్నారు పవన్ కల్యాణ్. ఏ జాతీయ పార్టీ అయినా.. తల మీద తుపాకులు పెట్టినా జనసేన పార్టీని కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ మాటగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు జనసేనాని.. పార్టీ నిర్మాణంలో భావజాలాన్ని అర్థం చేసుకున్న వారికి ఇంఛార్జీలుగా అవకాశం ఇస్తున్నామని ప్రకటించారు పవన్ కల్యాణ్.