బలసలరేవు దీక్షకు పవన్‌ సంఘీభావం...

బలసలరేవు దీక్షకు పవన్‌ సంఘీభావం...

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... వాల్తేరు గ్రామాన్ని సందర్శించారు... బలసలరేవు వంతెన కోసం 608 రోజులుగా వాల్తేరు గ్రామస్తుల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతుండగా... దీక్షా శిబిరానికి వెళ్లిన పవన్... వాల్తేరు గ్రామస్తుల దీక్షకు సంఘీభావం తెలిపారు. గ్రామస్తుల అభిప్రాయాలను స్వయంగా తన సెల్ ఫోన్ లో రికార్డు చేశారు పవన్ కల్యాణ్... మనం సామాన్యులం... చిన్న చిన్న కోరికలే మనకుంటాయన్న ఆయన... రూ. 9 కోట్లతో పూర్తి కావాల్సిన వంతెన ఈరోజు రూ. 60 కోట్ల అంచనాలకు చేరుకుందని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తున్నాం... బలసలరేవు పూర్తి చేయకపోతే జనసేన అధికారంలోకి రాగానే మనమే నిర్మించుకుందాం అన్నారాయన.

కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కాదు... జనం సమస్యల్లోంచి  పుట్టిన పార్టీ జనసేన అన్నారు పవన్ కల్యాణ్... ఓ చిన్న బ్రిడ్జి నిర్మించే పరిస్థితిలో కూడా ప్రస్తుత ప్రభుత్వం లేదని ఆరోపించిన ఆయన... మాకేమీ వేలకోట్లు లేవు... మీ అభిమానమే నా బలం అన్నారు. వంతెన కోసం 608 రోజులు దీక్ష చేయడం చిన్న విషయం కాదని... బలసలరేవుసాదిద్ధాం... సిక్కోలు సత్తా చూపిద్దాం అని పిలుపునిచ్చారు. వాల్తేరు గ్రామప్రజలకు నేను అండగా ఉంటా... సీఎం అని అరిస్తే మార్పురాదు... మీరు జనసేనకు ఓట్లు వేస్తేనే మార్పు వస్తుందన్నారు. మా అరుపుల వెనుక ఆవేదన, బాధ ఉంటాయన్న పవన్... సిక్కోలు మా నాయనమ్మ జిల్లా అని గుర్తుచేసుకున్నారు. శ్రీకాకుళం నుంచి ఇద్దరు మంత్రులున్నారు... కానీ, ప్రజలకు అండగా నిలబడలేదని విమర్శించారు. జనంలోంచి బలమైన, శక్తివంతమైన నాయకుడు పుట్టాలి... అలాంటి నాయకుడిని మీలోంచి నేను తయారుచేస్తానన్న జనసేనాని... నేను ఇతర పార్టీల్లాగా 25 కేజీల బియ్యం ఇవ్వడానికి రాలేదు... 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వడానికి వచ్చానన్నారు.