రోజంతా ధ్యానంలో పవన్

రోజంతా ధ్యానంలో పవన్

గత కొద్దిరోజులుగా రాజకీయాలు, సినీ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికవేత్తగా మారిపోయారు. ఇవాళ తిరుమల పర్యటనలో ఎక్కడా రాజకీయాలు కానీ... మరో ప్రస్తావన కానీ లేకుండా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. నిన్న రాత్రి అలిపిరి చేరుకున్న పవన్ కాలినడకన తిరుమల చేరుకుని.. ఉదయం 10 గంటలకు సామాన్య భక్తులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.. దర్శనం తర్వాత మహాద్వారం నుంచి బయటకు వచ్చిన జనసేనాని తెల్లని వస్త్రాల్లో ఒక యోగిలా కనిపించారు. శక్తివంచన లేకుండా సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని శ్రీవెంకటేశ్వరుని ప్రార్థించానని.. ఇక్కడే ఉన్న యోగా నరసింహ క్షేత్రంలో తనకు అన్నప్రాసన జరిపారని తన తల్లిదండ్రులు తరచూ చెప్పేవారని.. పవన్ సన్నిహితులతో అన్నారట.. ఈ రోజు ఎవరిని కలవకుండా పూర్తిగా ధ్యానంలో గడుపుతానని చెప్పారట.. మరో రెండు రోజుల పాటు తిరుమల గిరులలోనే పవన్ గడుపుతారని జనసేన వర్గాలు తెలిపాయి.. రేపు కొండపై ఉన్న మిగిలిన క్షేత్రాలను దర్శించుకుంటారని సమాచారం. మరోవైపు ఒక సెలబ్రెటీలా కాకుండా సామాన్య భక్తుడిలా తమతో పాటే దర్శనానికి వచ్చిన పవన్‌ను చూసి భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.