వ్యూహం ప్రకారమే సీఎం ప్రకటన..? రాజధాని ప్రాంతానికి జనసేన టీమ్..

వ్యూహం ప్రకారమే సీఎం ప్రకటన..? రాజధాని ప్రాంతానికి జనసేన టీమ్..

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం చర్చగా మారింది... అయితే, సీఎం ప్రకటనపై ఒక్కో ప్రాంతం నేతలు ఒకలా స్పందిస్తున్నారు. అయితే, సీఎం నిర్ణయాన్ని ఇప్పటికే తప్పుబట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు పార్టీ టీమ్‌ను పంపించనున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారంపై వరుస ట్వీట్లు చేసిన జనసేనాని... "జగన్ రెడ్డిగారు అసెంబ్లీలో ప్రకటన ఒక వ్యూహం ప్రకారమే చేశారు.. నేను పోరాట యాత్రలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర భూములు చాలా వరకు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని స్థానికులు చెప్పారు. విశాఖ ప్రాంతంలో భూములను ముందుగానే హస్తగతం చేసుకుంటూ వచ్చారు. అలాగే వివాదాస్పద భూముల పంచాయతీలు మొదలుపెట్టారు. విలువైన భూముల రికార్డులు లేవు, వాటిపై కఠినంగా ఉన్న జాయింట్ కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటిని ఆగమేఘాలపై తప్పించి... అక్కడే కింది పోస్టులోకి మార్చి అవమానించారు. ఆ పోస్టులో తమకు అనుకూలమైన వేణుగోపాల్‌రెడ్డిని నియమించుకున్నారు. ఈ హడావిడి బదిలీ వారం రోజుల కిందటే చేశారు. ఇలా చేయడాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా తప్పుబడుతున్నారు. అయినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. ఇక అక్కడ పులివెందుల పంచాయతీలు మొదలవుతాయి'' అని ట్వీట్ చేశారు. 

ఇక, అమరావతి రాజధాని ప్రాంత రైతులు మూడు పంటలు పండే భూముల్ని, గత ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం వారి భూములు అడిగినప్పుడు, అనేక భయాలు, అభద్రతా భవాల మధ్యలో ప్రభుత్వం మోసం చేయదనే నమ్మకంతోనే కాక.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని ఇచ్చారు. కానీ, కొత్త వైసీపీ ప్రభుత్వం రాగానే వచ్చిన కొద్దీ రోజుల నుంచి రాజధానిపై ఇక స్పష్టత లేని ప్రకటనలు, నిన్నటి అసెంబ్లీ సమావేశాల దాక చోటు చేసుకున్న మార్పులు, సహజంగానే భమూలు కోల్పోయిన రైతులులో ఉన్న భయాలు వారి వేదన ఉండటం సహజం, ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని రైతులకి భరోసా, మనోధైదర్యం ఇవ్వటానికి, ముఖ్యమైన నాయకులని నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో వారి దగ్గరకి పంపిస్తున్నాను... ఇంకా వైసీపీ ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చే వరకు దయచేసి వేచియుండండి, అందులో పొందుపరిచిన నిర్ణయాలని బట్టి స్పందిద్దాం'' అని పేర్కొన్నారు. అలాగే.. "రాజధాని అమరావతి ప్రాంతంలో నెలకొన్ని పరిస్థితులను పరిశీలించేందుకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ని ఆ ప్రాంతంలో పర్యటించమని సూచించాను... ఆయన నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు రాజధాని గ్రామాల్లో 20వ తేదీన పర్యటిస్తారు... రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలను ఈ బృందం తెలుసుకుంటుంది. ఆ ప్రాంత ప్రజలకు జనసేన ఎప్పుడూ భరోసాగా నిలుస్తుంది. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకూ అనుసరించాల్సిన కార్యాచరణను ఈ బృందం రైతులతో చర్చిస్తుంది.'' అది అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు జనసేనాని పవన్ కల్యాణ్.