వచ్చే వేసవిలో ప్రభాస్, పవన్, ఎన్టీఆర్ ఫైట్!?

వచ్చే వేసవిలో ప్రభాస్, పవన్, ఎన్టీఆర్ ఫైట్!?

ఈ వేసవి ఇప్పుడిప్పుడే ఆరంభమవుతోంది.... అయతే సినీజనం మాత్రం అప్పుడే రాబోయే సమ్మర్ సందడి గురించి మాట్లాడుకుంటున్నారు... ఎందుకంటే వచ్చే వేసవిలో ప్రభాస్ 'సలార్' సంబరం సాగనుంది... ప్రభాస్ కు పోటీగా మరో ఇద్దరు టాప్ స్టార్స్  సైతం సమ్మర్ పైనే గురి పెట్టారు...  'బాహుబలి' స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ యన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగ్గురూ ఈ యేడాది బిజీ బిజీగానే సాగనున్నారు... ప్రభాస్ నటించే 'రాధేశ్యామ్' ఈ యేడాది జూలైలో జనం ముందు వాలనుంది... ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'సలార్' ఆరంభమయింది... దీనితో పాటే ప్రభాస్ రామునిగా నటించే 'ఆదిపురుష్' కూడా సెట్స్ పైకి వెళ్ళింది... ఈ రెండు సినిమాల్లో 'సలార్' వచ్చే సంవత్సరం వేసవికి ప్రేక్షకులను పలకరించబోతోందని ఇప్పటికే ప్రకటించారు... ఇదే సీజన్ లో పవన్ కళ్యాణ్, జూనియర్ యన్టీఆర్ కూడా తమ చిత్రాలను విడుదల చేస్తారట... త్వరలో 'వకీల్ సాబ్'గా రానున్న పవన్ కళ్యాణ్ 28వ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. పవన్, హరీశ్ కాంబినేషన్ లో వచ్చిన 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్... కాబట్టి, వారిద్దరి కాంబో అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది... పవన్, హరీశ్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రాన్ని రాబోయే వేసవికి విడుదల చేయాలని ప్రణాళిక వేసినట్టు సమాచారం...
ప్రభాస్ తో పవన్ ఢీ కొట్టడం ఖాయమని తెలుస్తోంటే, మరోవైపు యంగ్ టైగర్ తో త్రివిక్రమ్ రూపొందించబోయే చిత్రం కూడా అదే సమయంలో సందడి చేయనున్నట్టు వినిపిస్తోంది... ఇంతకు ముందు యన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'అరవింద సమేత' ఆరంభంలో అదరహో అనిపించినా, తరువాత ఊపు చూపించలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా యన్టీఆర్ కు ఓ బిగ్ హిట్ ఇవ్వాలన్న సంకల్పంతో త్రివిక్రమ్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇది యన్టీఆర్ కు 30వ సినిమా. అందువల్ల ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అనే చెప్పవచ్చు.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనుందట! ప్రభాస్ 'సలార్' సమయంలోనే పవన్ సినిమా రావడం ఖాయం అన్న విషయం అంతగా ఆశ్చర్యం కలిగించడం లేదు. కానీ, పవన్ 28వ సినిమా వచ్చే సమయంలోనే యన్టీఆర్ 30వ సినిమాను బరిలోకి దింపడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేయడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే పవన్, త్రివిక్రమ్ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అందరికీ తెలుసు. వారిద్దరి స్నేహం గురించి టాలీవుడ్ లో భలేగా చెప్పుకుంటారు... చిత్రసీమలో చిత్రవిచిత్రాలు సహజమే! మరి ఈ ఇద్దరు మిత్రుల సినిమాలు బాక్సాఫీస్ బరిలో వచ్చే యేడాది వేసవిని ఎలా వేడెక్కిస్తాయో చూడాలి...