'హోదా'పై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

'హోదా'పై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రజల నుంచి రావాల్సినంత నిరసన రానప్పుడు ఎంత బలమైన పోరాటం చేసినా ఉపయోగం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అక్కడి ప్రజలకు ఉన్నంత ఆకాంక్ష, కోపం.. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రా ప్రజలకు ఉందా లేదా? అని ఒక్కోసారి సందేహం కలుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అక్కడి ప్రజలు దశాబ్దాలు పోరాడారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదాపై మాట మారుస్తున్న నాయకులపై ప్రజలే ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. 

ఓటమి చెందితే పార్టీని నడపగలనా లేదా అనేది ఆలోచించే రంగంలోకి దిగానన్నారు. సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేనను ఏర్పాటు చేశామని చెప్పారు. తాను ఓటమి చెందాక కూడా ప్రజలు తనను ఆపి తమ సమస్యలు చెప్పడం చూస్తే.. తనపై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో అర్ధమైందన్నారు.   తమ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని పవన్‌ వెల్లడించారు.

ఇక.. హైదరాబాద్‌లోని ఏపీ ఆస్తులను తెలంగాణకు ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రభుత్వం వివరణ ఇస్తేనే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం కోసం జనసేనను ఏర్పాటు చేశామని  పవన్‌ చెప్పారు. అక్రమ కట్టడాలను కూల్చే అంశంలో అందరికీ ఒకే నియమం ఉండాలని, లేదంటే ప్రభుత్వాన్ని శంకించాల్సి వస్తుందని పవన్‌ అభిప్రాయపడ్డారు.