మేం వైసీపీ, టీడీపీలా కాదు: పవన్‌

 మేం వైసీపీ, టీడీపీలా కాదు: పవన్‌

'ఎన్నికలు అవగానే వైసీపీ 120 స్థానాలు వస్తాయంటే, టీడీపీ తమకు ఇన్ని స్థానాలు వస్తాయని చెబుతోంది. టీడీపీ, వైసీపీ మాదిరిగా జనసేన లెక్కలు వేసుకోదు. ఎన్నికల తర్వాత ఓటింగ్ సరళి మాత్రమే తెలుసుకోవాలని మా నేతలకు చెప్పాను' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన యువ అభ్యర్థులతో ఇవాళ అమరావతిలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ జనసేనది ఎదిగే దశ అని.. ఎంతలా మార్పు వస్తుందో తెలియదు కానీ మార్పు నెమ్మదిగా వస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే మార్పును తీసుకెళ్తామని.. తెలంగాణ ప్రజలు కూడా మార్పును ఆహ్వానిస్తున్నారని అన్నారు. 

నిధులు, నియామకాల్లో తేడాలు వస్తేనే ఉద్యమాలు పుడతాయని.. తెలంగాణ ఉద్యమం అలాంటిదేనని అన్నారు పవన్‌. ప్రతిచోటా రెండు కుటుంబాలే అన్నింటినీ ఆపరేట్ చేస్తున్నాయని.. నీళ్లు ఎవరికి ఇవ్వాలో కూడా వారే నిర్ణయిస్తున్నారని పవన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపైనే ఫైట్‌ చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ఇక.. ఎన్నికల్లో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలపటం మరవద్దని యువ అభ్యర్థులకు పవన్‌ సూచించారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు అలానే ఉంచాలన్న పవన్‌.. ప్రతి గ్రామంలో సమస్యలను గుర్తించి, గ్రామ స్థాయిలో నాయకులకు తయారు చేయాలని చెప్పారు.