పవన్‌ సీటుపై క్లారిటీ.. అక్కడి నుంచే బరిలోకి?

పవన్‌ సీటుపై క్లారిటీ.. అక్కడి నుంచే బరిలోకి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేయబోతున్నారు..? కొన్ని రోజులుగా ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. పిఠాపురం, గాజువాకల్లో ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమని.. రెండు చోట్లా బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదని ప్రచారం జరుగుతోంది. జనసేన రెండో జాబితా కూడా విడుదలైన నేపథ్యంలో పవన్ పోటీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 

గాజువాక నుంచి ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన చింతలపూడి వెంకట్రామయ్య గతేడాది జనసేనలో చేరారు. గాజువాక నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని గ్రౌండ్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకున్నారు. కానీ.. అధినేత పవన్‌ దృష్టి గాజువాకపై పడిందని తెలియడంతో ఆయన.. పక్కనే ఉన్న పెందుర్తిపై ఫోకస్‌ పెట్టారు. కాపులు అధికంగా ఉన్న పెందుర్తిలో పరిస్థితి సానుకూలంగా ఉంటుందన్న నమ్మకంతో అక్కడి నుంచి పోటీ చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఈక్రమంలోనే జనసేన రెండో జాబితాలో చింతలపూడి వెంకట్రామయ్యకు పెందుర్తి టికెట్‌ను ఖారారు చేసింది అధిష్టానం. వెంకట్రామయ్యకు పెందుర్తి టికెట్‌ ఖారారవడంతో.. పవన్‌ గాజువాక నుంచి బరిలోకి దిగుతారని పార్టీ శ్రేణులు అంచనాకు వస్తున్నాయి. 

గాజువాక విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలే ఇక్కడ ప్రధానంగా పోటీ పడ్డాయి. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. పల్లాకు మరోసారి టికెట్‌ ఖాయమనుకున్న సమయంలో పవన్‌ ఇక్కడి నుంచి పోటీకి దిగుతారని వార్తలు రావడంతో సమీకరణలు అతివేగంగా మారుతూ వచ్చాయి. పవన్‌ను ఎదుర్కొనే ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాల్సిన పరిస్థితి ఉండడంతో టీడీపీ ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టింది. టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను ఎంపీగా పంపి, ఆయన స్థానంలో గాజువాకకు  బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పార్టీ ప్రకటించే అవకాశం వున్నదని సీనియర్‌ నాయకులు భావిస్తున్నారు. ఇక... గాజువాక నుంచి వైసీపీ తరఫున తిప్పల నాగిరెడ్డి, బీజేపీ నుంచి పులుసు జనార్దన్‌ పోటీ చేయబోతున్నారు. ఈమేరకు ఇప్పటికే వీరి అభ్యర్థిత్వాలను ఖారారు చేస్తూ ఆ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.