చార్జీల వసూలుపై సీబీడీటీ సీరియస్.. వివరణకు ఆదేశం..!

చార్జీల వసూలుపై సీబీడీటీ సీరియస్.. వివరణకు ఆదేశం..!

ఇప్పుడంతా డిజిటల్‌ పేమెంట్స్‌.. బ్యాంకులో క్యాష్‌, జేబులో ఫోన్ ఉంటే చాలు.. ఎక్కడైనా.. ఏదైనా కొనుగోలు చేయొచ్చు.. క్యాష్‌ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.. అయితే, పనిలో పనిగా చార్జీల వడ్డింపు కూడా కొనసాగుతుందనే విమర్శలున్నాయి.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పలు పేమెంట్‌ గేట్‌వే సర్వీస్‌ ప్రొవైడర్లు యూపీఐ, రూపే కార్డ్‌ లావాదేవీలపై చార్జీలు వసూలు చేస్తుండటంపై సీబీడీటీ రంగంలోకి దిగింది. చార్జీల వసూలుపై వివరణ ఇవ్వాలని సర్వీస్‌ ప్రొవైడర్లను కోరింది. యూపీఐ, రూపే కార్డు లావాదేవీలపై వసూలు చేసిన చార్జీలను తిరిగి చెల్లించాలని గతేడాది ఆగస్టులో అన్ని బ్యాంకులను సీబీడీటీ ఆదేశించింది. ఈ రెండు మాధ్యమాల్లో చెల్లింపులకు చార్జీలు వసూలు చేయరాదని 2019 డిసెంబర్‌లో కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అయితే పేమెంట్‌ సదుపాయం కల్పిస్తున్న వారికి పరిహారం చెల్లించకుండాచార్జీల వసూలుపై నిషేధం విధించటాన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో పేమెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రిజర్వ్‌బ్యాంకు గత వారం ప్రకటించింది. అయితే, చిరు వర్తకులకు మాత్రమే ఉచితంగా సేవలు అందించగలమని సర్వీస్‌ ప్రొవైడర్లు చెబుతున్నారు... మరీ, సీబీడీటీ ఆదేశాలకు ఎలాంటి వివరణ వస్తుందనేది వేచిచూడాలి.