శివప్రసాద్ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన వైకాపా నేత

శివప్రసాద్ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన వైకాపా నేత

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. శివప్రసాద్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వైకాపా నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శివప్రసాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఆయన, శివప్రసాద్ విలక్షణ రాజకీయ నాయకుడని, ప్రతిభగల నటుడని అన్నారు.

శివప్రసాద్ తో తనకున్న సంబంధం రాజకీయాలకు అతీతమైనదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన అకాల మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేరుకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని అన్నారు. తనను శివప్రసాద్ అన్న అంటూ ప్రేమతో పలకరించేవారని అటువంటి వాడిని కోల్పోయానని ఆయన పేర్కోన్నారు. ఇక ఈ ఉదయం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తిరుపతికి చేరుకుని శివప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. శివప్రసాద్ మరణవార్త చాలా బాధ పెట్టిందని అన్నారు.

ఇక ఏపీ సర్కార్ తరఫున మాజీ ఎంపీ శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. శివప్రసాద్ ప్రజల మనిషని.. తన అన్నను కోల్పోయానని చెవిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. శివప్రసాద్ స్వగ్రామం పులిత్తివారిపల్లిలో త్వరలో విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. కాగా, శివప్రసాద్ అంత్యక్రియలు నేడు చంద్రగిరి సమీపంలోని అగరాలలో జరగనున్నాయి. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేష్‌ తదితరులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. మరికాసేపట్లో శివప్రసాద్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.