ఏపీలో ఇసుక తవ్వకాలపై కీలక నిర్ణయం

ఏపీలో ఇసుక తవ్వకాలపై కీలక నిర్ణయం

ఏపీలో ఇసుక తవ్వకాలకు సంబంధించి 15 రోజుల్లో కొత్త విధానం తీసుకొస్తామని.. అప్పటి వరకు ఇసుక తవ్వాకాలు నిలిపివేయాలని రాష్ట్ర గనుల శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.. ఇసుక తవ్వకాలపై ఉన్నతాధికారులతో ఇవాళ ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్న ఆయన.. కొత్త శాండ్ పాలసీ వచ్చే వరకు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేయకూడదని స్పష్టం చేశారు. ఎక్కడ ఉన్న ఇసుక అక్కడే ఉంచాలని.. ఇసుక తరలించే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. గతంలో మైనింగ్‌ చేసి నిల్వ చేసిన ఇసుకను మాత్రం తరలించుకోవచ్చని మంత్రి స్పష్టంచేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తే జిల్లా అధికారులే బాధ్యత వహించాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై  చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించిన పెద్దిరెడ్డి.. ఇకపై ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసులు పెడతామని హెచ్చరించారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతలు ఇసుక రవాణాతో వేలకోట్ల రూపాయలు సంపాదించారని.. ఇసుక అక్రమాల్లో చేసిన పాపాల వల్లే టీడీపీ  చాలా చోట్ల ఓడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది మైనింగ్‌ ద్వారా రూ.2,643 కోట్లు ఆదాయం వచ్చిందని.. కానీ ఇసుక ద్వారా రూ.116 కోట్లే వచ్చాయని పెద్దిరెడ్డి చెప్పారు. రాష్ట్రం నుంచి చెన్నై, కర్ణాటక, హైదరాబాద్‌ ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని తెలిపారు.