వాళ్ల‌కు ర‌క్షా బంధ‌న్ అంటే వ‌ణుకు.. రాఖీ క‌డితే అంతే..!

వాళ్ల‌కు ర‌క్షా బంధ‌న్ అంటే వ‌ణుకు.. రాఖీ క‌డితే అంతే..!

భార‌తీయ సంస్కృతిలో ఎన్నో పండుగ‌లు జ‌రుపుకుంటారు.. ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జ‌రుపుకుంటారు.. ఇక‌, ర‌క్షా బంధ‌న్‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది.. ఈ పండుగ అన్న చెల్లెళ్లు మరియు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమ ఆప్యాయతలకు గుర్తుగా జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్ల మ‌ధ్య మాట‌లు లేక‌పోయినా.. ఈ రోజు రాఖీ క‌ట్టేవాళ్లు కూడా ఉంటారు.. ఒక్క తోబొట్టువుల‌‌కే కాకుండా రిలేష‌న్ ఉన్న ఎవ‌రికైనా రాఖీ క‌ట్టి వారి బంధాన్ని బ‌ల‌ప‌ర్చుకుంటారు.. కానీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ గ్రామంలో ర‌క్షా బంధ‌న్ అంటేనే వాళ్ల‌కు వ‌ణుకు పుడుతోంది.. ఈ పండుగ జ‌రుపుకుంటేనే అనార్థాలు జ‌రిగిపోతాయ‌ట‌.. దీంతో.. ద‌శాబ్దాలుగా రాఖీ పండుగ‌ను జ‌రుపుకోవ‌డ‌మే మానేశారు. 

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని వ‌జీరాగంజ్ పంచాయ‌తీలోని జ‌గ‌త్‌పూర్వ‌లో రాఖీ పండుగ జ‌రుపుకుంటే అన‌ర్థాలు జ‌రుగుతాయ‌ని వ‌ణికిపోతున్నారు.. రాఖీ క‌ట్ట‌డానికి గ‌డప దాటి వెళ్తే సోద‌రులు ప్రాణాల‌తో తిరిగిరారు అనేది వారి భ‌యం.. దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం చూపిస్తున్నారు గ్రామ‌స్తులు.. 1955లో రక్షా బంధన్ రోజు ఉదయం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.. అది కీడుకు సంకేతమంటూ.. అస‌లు రాఖీలు క‌ట్టుకోవ‌డ‌మే మానేశారు.., అయితే, దశాబ్దం కిందట ఓసారి రాఖీ పండుగ జరపాలని నిర్ణయించుకున్నార‌ట‌.. కానీ, తర్వాతి రోజు ఉదయం కూడా ఓ ఊహించ‌ని ఘ‌ట‌న జ‌రిగిపోయింది. దీంతో రాఖీ పండుగ జరపడం తమ ఊరికి, ప్రజలకు మంచిది కాదనే నిర్ణయానికి వ‌చ్చేశార‌ట‌.. అప్ప‌టి నుంచి ఊరిలో రాఖీలు క‌ట్ట‌డం.. క‌ట్టించుకోవ‌డం లాంటివి చేయ‌డంలేదు.