పవన్ నాయుడూ అంటూ మాటకు మాట కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని

పవన్ నాయుడూ అంటూ మాటకు మాట కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని


వైసిపి, జన సేన మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పవన్ చేసిన ప్రతీ వ్యాఖ్య కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పేర్నినాని. పవన్ నాయుడు అంటూ ప్రెస్ మీట్ మొదలు పెట్టిన పేర్ని నాని పెళ్లిళ్లు, రాజకీయాలు, ప్రజాసేవ తదితర అంశాలను ఎవరైనా మనసుకు నచ్చినట్టు చేస్తారని అన్నారు. పవన్ కు పెళ్లిళ్ల మీద మక్కువ ఉంటే, సీఎం జగన్ కు ప్రజాసేవపై మక్కువ ఉందని తెలిపారు. సీఎం జగన్ ఎప్పుడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, వెంకయ్యనాయుడు గురించి గతంలో చేసిన విమర్శలను పవన్ గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ చేస్తున్న మంచి పనులు పవన్ నాయుడికి కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ఓవైపు సీఎం జగన్ ఎన్నికల హామీలను అమలు చేస్తుంటే, పవన్ నాయుడికి ఇసుక తప్ప మరేమీ కనిపించడం లేదని అన్నారు.  

చంద్రబాబు చెప్పిన మాటలతోనే పవన్ నాయుడు రోడ్లపైకి వస్తున్నారని ఆరోపించారు. దున్నపోతు ఈనిందని చంద్రబాబు అంటే, దూడను కట్టేస్తానంటూ పవన్ వస్తున్నారని ఎత్తిపొడిచారు. పవన్ నాయుడు అని ఎందుకు అంటున్నానో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని తెలిపారు. పవన్ కు నరనరాన కులతత్వం జీర్ణించుకుపోయిందని, ఎవరో సినిమా రైటర్ రాసిస్తే విమర్శలు చేయడం సరికాదన్నారు. పవన్ నాయుడు గారూ మీరు ఒక్కసారి తాట తీస్తే మీ ఎదుటివాళ్లు పదిసార్లు మీ తాట తీస్తారని హెచ్చరించారు. ఖాళీగా ఉండి పవన్ రోజూ ట్వీట్లు చేస్తున్నారని పార్టీ పెట్టింది మొదలు.. జగన్ను విమర్శించడం మినహా ఏం చేశారని ప్రశ్నించారు.