కోర్టుకు కెక్కిన కోతి వ్య‌వ‌హారం.. ఆ కోతిని ప‌ట్టిస్తే నజరానా కూడా..!

కోర్టుకు కెక్కిన కోతి వ్య‌వ‌హారం.. ఆ కోతిని ప‌ట్టిస్తే నజరానా కూడా..!

ఓ కోతి విష‌యం కోర్టు వ‌ర‌కు వెళ్లింది.. చివ‌ర‌కు ఆ కోతిని పట్టిస్తే న‌జ‌రానా కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని చండీగఢ్ కు చెందిన పచ్చబొట్టు ఆర్టిస్ట్‌ కమల్‌జీత్‌ సింగ్‌, ఆయన మేనేజర్‌ దీపక్‌ ఓహ్రా ఓ కోతిని పెంచుకునే వాళ్లు. అయితే, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అది నేరం. దీంతో, ఆ ఇద్ద‌రినీ గత ఆగస్టులో అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆ తర్వాత రోజే బెయిల్‌పై విడుదలయ్యారు. కోతిని పెంచుకోవడం వాస్తవమేనని.. అయితే, అది చట్ట రీత్యా నేరమని తెలిసిన తర్వాత అడవిలో విడిచి పెట్టేశామని పోలీసులకు చెప్పారు. 

కానీ, వారు చెప్పిన మాట‌లు నమ్మశక్యంగా లేవంటూ పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టుకు వెళ్లింది.. ఇక‌, ఆ పిటిష‌న్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. కోతిని అడ‌విలో విడిచిపెట్టిన‌ట్టు ఆధారలతో స‌హా నిరూపించాలని నిందితులకు సూచిస్తూ కేసును అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇక‌, కోతిని అడవిలో విడిచిపెట్టినట్లు వారు కచ్చితమైన ఆధారాలేవీ సమర్పించలేకపోయారన్నారు ఫారెస్ట్ అధికారులు... అంతేకుండా కోతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇక‌, ఈ విష‌యంలో కోర్టుకు వెళ్లిన స్వ‌చ్ఛంద సంస్థ కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకుంది.. కోతి దాని ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నజరానా ప్రకటించింది. మొత్తానికి కోతిపై న‌జ‌రానా ప్ర‌క‌టించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.