వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయండి..!

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయండి..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వీఐపీ బ్రేక్ దర్శనాలపై  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏ ప్రతిపాదికన విభజించారో చెప్పాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు పిటిషనర్. బ్రేక్ దర్శనాల మార్గదర్శకాలు లేదా జీవోను చూపించాలని పిటిషనర్ వాదన. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు చేయాలని కోర్టును కోరారు పిటిషనర్. భక్తులందరినీ సమానంగా చూడాలని వాదించాడు. వీఐపీ బ్రేక్ దర్శనాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, టీటీడీ స్టాండింగ్ కమిటీని ఆదేశించింది హైకోర్టు. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతం బ్రేక్‌ దర్శనం టికెట్లను మూడు కేటగిరీల్లో విభజించి.. శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. స్థాయిని బట్టి వీటిని మంజూరు చేస్తున్నారు. వీరిలో ఎల్1 టికెట్ ఉంటే, ఒత్తిడి లేకుండా స్వామివారి దర్శనం (అత్యంత ప్రముఖులకు), ఆపై తీర్థం, శఠారీ మర్యాదలు; ఎల్2 టికెట్ ఉంటే, గర్భగుడి ముందు ద్వారమైన కులశేఖరపడి వరకు స్వామి వారిని దర్శించుకుంటూ వేగంగా వెళ్లేందుకు వీలు కల్పించడం.. ఎల్3 ఉంటే, మరింత వేగంగా కదిలేలా కూలైన్లను పర్యవేక్షిస్తూ, దర్శనం కల్పిస్తోంది టీటీడీ. దీనిపై ఎంతోకాలంగా విమర్శలు వస్తున్నాయి.