భారత ముస్లింలను పాకిస్థాన్ కి పంపాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్ట్

భారత ముస్లింలను పాకిస్థాన్ కి పంపాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్ట్

భారత్ లోని ముస్లింలందరినీ పాకిస్థాన్ కి పంపాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్ట్ శుక్రవారం కొట్టేసింది. జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ సరన్ ల బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ' దీనిపై మీరు నిజంగా వాదించాలని అనుకుంటున్నారా? మేం మీ వాదనలను వింటాం. కానీ మీపై ఆక్షేపణలను కూడా జారీ చేస్తామని' జస్టిస్ నారిమన్ పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపారు. దీనికి పిటిషనర్ 'లేదు' అని సమాధానం చెప్పడంతో పిటిషన్ ను కొట్టేసినట్టు బార్ &బెంచ్ తెలిపింది.

మేఘాలయ హైకోర్ట్‌ ఒక తీర్పు సందర్భంగా 'పాకిస్థాన్ తమను తాము ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది. మతం ప్రాతిపదికన దేశ విభజన జరిగినందువల్ల భారత్ కూడా తనను తాను హిందూ రాజ్యంగా ప్రకటించుకోవాల్సింది. కానీ లౌకిక రాజ్యంగా మిగిలిందని' వ్యాఖ్యానించడంపై దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం గత నెల నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల బెంచ్ మేఘాలయ హైకోర్ట్ రిజిస్ట్రార్ కి నోటీసులు జారీ చేసింది.  

2011 జనాభా లెక్కల ప్రకారం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, ఏడు రాష్ట్రాల్లోని హిందువులకు మైనారిటీ హోదా ఇవ్వాలని కోరుతూ 2017లో దాఖలైన అప్పీలును కూడా అత్యున్నత న్యాయస్థానం గతంలో తిరస్కరించింది. '2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు మైనారిటీలుగా లక్షద్వీప్ లో (2.5%), మిజోరామ్ (2.75%), నాగాలాండ్(8.75%), మేఘాలయ(11.53%), జమ్ముకశ్మీర్(28.44%), అరుణాచల్ ప్రదేశ్(29%), మణిపూర్(31.39%), పంజాబ్(38.40%) ఉన్నారని' పేర్కొన్నారు. కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ హిందువులను మైనారిటీలుగా ప్రకటించని కారణంగా మెజారిటీ జనాభాకు మైనారిటీ హక్కులు ఇచ్చేస్తున్నారని పిటిషన్ లో తెలిపారు.

దేశ జనాభాలో ముస్లింలు 14.2% ఉన్నారు. అందువల్లే భారత్ లౌకిక రాజ్యంగా గుర్తింపు పొందింది.