89 మంది ప్రాణాలు కాపాడిన పైలెట్

89 మంది ప్రాణాలు కాపాడిన పైలెట్

మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెనుప్రమాదం తప్పింది. ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి 89 మంది ప్రాణాలు కాపాడాడు. యాంగూన్‌లోని మాండలే విమానాశ్రయంలో ఘటన జరిగింది. విమానంలో లోపం తలెత్తడంతో ముందు భాగంలోని టైరు తెరచుకోలేదు.. రన్‌ వేపై పైలట్‌ ఆ విమానాన్ని దింపుతున్న సమయంలో విమానం ముందు భాగం రన్ వేను తాకింది. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదు. పైలట్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి విమానం వెనక టైర్ల సాయంతో ల్యాండ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

విమానం ముందు భాగం కొంత రన్‌వేను తాకినప్పటికీ అప్పటికే విమానం పూర్తిగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. 96 నుంచి 114 మధ్య సీట్లు ఉన్న ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది 82 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ముందు భాగంలోని టైరు తెరచుకోకపోవడంతో వెనకవైపున ఉండే టైర్ల సాయంతో మాత్రమే విమానాన్ని దించాల్సి వచ్చింది. పైలట్ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విమానాన్ని సురక్షితంగా దించారు’ అని ఓ అధికారి మీడియాకు తెలిపారు.