పరువు తీశారు....కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

పరువు తీశారు....కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు


ఏపీ ప్రభుత్వం పీపీఏల పునఃసమీక్షపై కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. అయితే ఇది జరిగి చాలా రోజలు అవుతున్నా పీపీఏల పునఃసమీక్ష వల్ల దేశం పరువు పోయిందని కేంద్రం ఎక్కడో ఒక చోట ప్రస్తావిస్తూనే ఉంది. తాజాగా ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదిక మీద పేర్కొన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. గత వారంలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనిమిక్ ఫోరం సదస్సుకు కేంద్రమంత్రి గోయల్ హాజరయ్యారు. దక్షిణాదిలో ఓ రాష్ట్రం పీపీఏల పునఃసమీక్షకు ప్రయత్నం చేసిందంటూ పరోక్షంగా ఆయన ఏపీ గురించి వ్యాఖ్యలు చేశారు. పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా కాంట్రాక్టులు గానీ, వాటికి సంబంధించిన.. నిబంధనలు గానీ మారకుండా ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఓ చట్టం లాంటిది రూపొందించాల్సిన అవసరముందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఒక వేళ అలా కాకుండా రాష్ట్రాలు అడ్డం తిరిగితే రాష్ట్రానికి వచ్చే నిధులలో కట్ చేయాలని రిజర్వు బ్యాంకును కోరతామని కేంద్రమంత్రి గోయల్ చెప్పుకొచ్చారు.