వందే భారత్ ఎక్స్ ప్రెస్ అంత ఫాస్టేం కాదు

వందే భారత్ ఎక్స్ ప్రెస్ అంత ఫాస్టేం కాదు

దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే హైస్పీడ్ ట్రెయిన్ గా చెప్పుకుంటున్న "వందే భారత్ ఎక్స్ ప్రెస్" ఒక వీడియోని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తయారైన ఈ ట్రెయిన్ వేగాన్ని చూపిస్తూ గోయల్ "ఇదో పిట్ట.. ఇదో ప్లేన్..వందే భారత్ ఎక్స్ ప్రెస్ మెరుపు వేగంతో దూసుకెళ్లడం చూడండి" అని పేర్కొన్నారు. 

గోయల్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి 13 సెకన్ల వీడియోని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన "ఇదో పిట్ట. ఇదో ప్లేన్. మేకిన్ ఇండియా పథకం కింద తయారైన దేశంలోని సెమీ హైస్పీడ్ ట్రెయిన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మెరుపు వేగంతో వెళ్లడాన్ని చూడండి" అని రాశారు.గోయల్ ఈ ట్వీట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఆయనపై విమర్శల దాడి చేసింది. "ఇంత స్పీడ్ కేవలం మిస్టర్ ఘొటాలా (కుంభకోణం) అబద్ధానిదే"నని చెప్పింది. ఆ ట్వీట్ చేసిన తర్వాత గోయల్ ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. చాలా మంది ఇది ఎడిటెడ్ వీడియో అని చెప్పారు. 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకంగా ఇంజన్ ఉండదు. ఒక రైలుకి 16 డబ్బాలు ఉంటాయి. దీనిని ముందుగా ఢిల్లీ-వారణాసి మధ్య నడపనున్నారు. దీని గరిష్ట వేగం గంటలకు 160కి.మీలు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని రాయ్ బరేలీలోని మాడర్న్ కోచ్ ఫ్యాక్టరీ 18 నెలల్లో తయారు చేసింది. దీనిపై రూ.97 కోట్లు ఖర్చయింది. దీనిని 30 ఏళ్ల క్రితం తయారుచేసిన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లకు తర్వాత తరం రైలుబళ్లుగా చెబుతున్నారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడుస్తుంది. ఢిల్లీ-వారణాసిల మధ్యలో ఇది కాన్పూర్, ప్రయాగరాజ్ లలో ఆగుతుంది. ఈ ట్రెయిన్ 755 కి.మీల దూరాన్ని 8 గంటల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం మిగతా రైళ్లు ఇదే దూరాన్ని 11.30 గంటల్లో చేరుతున్నాయి.