మణిపూర్ ఎన్ కౌంటర్లపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే

మణిపూర్ ఎన్ కౌంటర్లపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే

మణిపూర్ ఎన్ కౌంటర్లపై సీబీఐ దర్యాప్తు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 350 మంది సైనికోద్యోగులు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్ట్ తిరస్కరించింది. సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్ఎస్పీఏ) కింద మణిపూర్ లో సైన్యం చేసిన ఎన్ కౌంటర్లను పలు సంస్థలు ప్రశ్నించాయి.అయితే ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం సైనికాధికారులకు అండగా నిలిచింది. ‘సైన్యం చేపట్టే ప్రతి చర్యను అనుమానాస్పదంగా చూడరాదు. మణిపూర్ లో చట్టవ్యతిరేక హత్యలుగా ఆరోపిస్తున్న కేసులేవీ సామూహిక హత్యకాండలు కావు. అవి సైనికచర్యలో భాగంగా జరిగినవని‘ కేంద్రం కోర్టుకు చెప్పింది.

మణిపూర్ లో నకిలీ ఎన్ కౌంటర్ కేసు నేపథ్యంలో సైనికాధికారులు అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టారు. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తమ చర్యలపై విచారణ చేపట్టరాదని సైనికోద్యోగులు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. తాము ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్ లలో కేవలం తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామని వారు పేర్కొన్నారు. మన దేశ సైనిక సిబ్బంది కోర్టులో ఇలా మొర పెట్టుకోవాల్సి రావడం దురదృష్టకరమని కేంద్రం కోర్టుకు చెప్పింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ వాదనను వినాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఎఎఫ్ఎస్పీఏ అమల్లో ఉండే ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లలో పాల్గొన్న 350 మంది సైనికులు తమను రక్షించాలని కోరడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. 

చొరబాట్లు అధికంగా ఉండే మణిపూర్ రాష్ట్రంలో సైన్యం, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు జరిపిన చట్టవ్యతిరేక హత్యల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు గత ఏడాది సుప్రీంకోర్టు ఆదేశించింది. 2000-12 మధ్య కాలంలో మణిపూర్ లో భద్రతా దళాలు, పోలీసులు దాదాపుగా 1,528 మందిని చట్టవ్యతిరేకంగా చంపాయని ఆరోపిస్తూ వాటిపై దర్యాప్తు జరిపించడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ ఈ ఆదేశాలిచ్చింది.