అంబానీ, అదానీలకు బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ మోడీ

అంబానీ, అదానీలకు బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ మోడీ

లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కి ముందు రాజకీయ పార్టీల్లో ఆరోపణల పర్వం జోరందుకుంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పంజాబ్ మంత్రి నవ్ జోత్ సింగ్ సిద్ధూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శల దాడి చేశారు. ప్రధాని పేదల కోసం కాకుండా ధనవంతుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వకుండా అంబానీ, అదానీల కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని దుయ్యబట్టారు.

శనివారం న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీపై సిద్ధూ నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి 55 దేశాల్లో పర్యటించి అంబానీ, అదానీలకు 18 భారీ కాంట్రాక్టులు ఇప్పించారని మండిపడ్డారు. 2015లో ప్రధానమంత్రి రష్యాలో పర్యటించినపుడు అంబానీ ఒక బలహీనంగా ఉన్న కంపెనీ అల్ మాజా మెంటల్ ను 6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారని, నెలలోపే రిలయన్స్ డిఫెన్స్ కి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆయన చెప్పారు.

ప్రధానమంత్రి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లి అక్కడ అంబానీని ఆఫ్ సెట్ భాగస్వామిని చేశారని తెలిపారు. అంతా రూ.10 పెన్ కి బిల్లు అడుగుతారు కానీ రాఫెల్ డీల్ లో ప్రధాని ఏదీ చూపలేదన్నారు. ఫ్రాన్స్ లో అంబానీకి 1100 కోట్ల అప్పులుంటే ఫ్రాన్స్ ప్రభుత్వం వాటిని మాఫీ చేసిందని ఆరోపించారు.

ప్రధానమంత్రి మోడీ అవినీతితో చేతులు కలిపారంటూ నవ్ జోత్ సింగ్ సిద్ధూ ప్రధాని స్వీడన్ వెళ్లి అక్కడ కూడా అంబానీకి కాంట్రాక్ట్ ఇప్పించారని చెప్పారు. అప్పుడే అదానీ ఎయిర్ ఫోర్స్ ప్లేన్ కి బిడ్ వేశారని గుర్తు చేశారు. ఈ కాంట్రాక్టులన్నీ ప్రభుత్వ కంపెనీలకు దక్కాల్సి ఉండగా అలా జరగలేదని ఆరోపించారు. అనిల్ అంబానీకి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు తయారు చేసేందుకు రూ.65,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి డీఆర్డీవోకి మొండిచెయ్యి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రధానమంత్రి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినపుడు కూడా 3,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును అంబానీ, అదానీలకు ఇప్పించారు తప్ప ఎన్టీపీసీ కాదన్నారు సిద్ధూ. ఈ కాంట్రాక్టులతో అంబానీ, అదానీల కంపెనీల రెండూ రాబోయే మూడేళ్లలో రూ.15,000 కోట్లకు పైగా లాభపడతాయని చెప్పారు. 

అదానీకి ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గని కాంట్రాక్ట్ దక్కిందని.. ఇరాన్ లో 500 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ సాధించిందని.. మొజాంబిక్, ఒమాన్, మయన్మార్, చైనాల్లో కూడా ఈ కంపెనీలకు పలు కాంట్రాక్టులు లభించాయని తెలిపారు. అంబానీ, అదానీలకు ప్రాజెక్టులు లభించిన తీరు చూసి తాను ప్రధానమంత్రిని మీరు అంబానీ, అదానీల బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజరా? అని అడగదల్చుకున్నట్టు సిద్ధూ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ రాముడు రాలేదు, ఉపాధి రాలేదు కానీ వీధి వీధిలో మొబైల్ వాడుకొనే నిరుద్యోగులు కనిపిస్తున్నారని సిద్ధూ ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లలో భారత్ రుణభారం 50 శాతం పెరిగిపోయిందని గుర్తు చేశారు. నిరుద్యోగం పెరుగుతూనే పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫసల్ బీమా యోజన రాఫెల్ డీల్ కుంభకోణం కంటే పెద్దదని సిద్ధూ ఆరోపించారు.