భారత్ దాడికి దిగితే దీటుగా ఎదుర్కొంటాం

భారత్ దాడికి దిగితే దీటుగా ఎదుర్కొంటాం

పుల్వామా ఉగ్రదాడిపై ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఘటనపై విచారించడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ ఎటువంటి ఆధారాలను ఇప్పటి వరుకూ చూపలేదని ఆయన అన్నారు. పాక్ ను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మాపై భారత్ దాడికి దిగితే దీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

పాక్ పాత్ర ఉందంటూ ఆరోపణ చేస్తున్న భారత్ ఎటువంటి ఆధారాలు చూపకుండా పాక్‌ను నిందించడం సరికాదని అన్నారు. పుల్వామా దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇమ్రాన్‌ చెప్పుకొచ్చారు. ఓ జాతి మీద, ఓ దేశం మీద అన్యాయంగా ముద్ర వేస్తారా అని అన్నారు. ఇలాంటి దాడిని పాకిస్థాన్ ప్రతిఘటిస్తుందని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. 

గత గురువారం పుల్వామాలోని సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాక్‌ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. దాడి నేపథ్యంలో పాక్‌కు అత్యంత ప్రాధాన్యత దేశం హోదాను భారత్‌ తొలగించింది.