30నగరాల్లో విధ్వంసానికి కుట్ర..! మోడీ, షా, దోవల్‌ టార్గెట్..!

30నగరాల్లో విధ్వంసానికి కుట్ర..! మోడీ, షా, దోవల్‌ టార్గెట్..!

ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్రపన్నారంటూ నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ లక్ష్యంగా టెర్రరిస్టులు దాడులకు తెగబడొచ్చన్న సమాచారంతో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జైష్‌-ఏ-మహ్మద్‌ టెర్రరిస్టులు... మన వైమానిక స్థావరాలపై ఆత్మహుతి దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలకు ఉప్పందింది. దీంతో శ్రీనగర్‌, అవంతిపుర, జమ్మూ, పఠాన్‌కోట్‌, హిండన్‌ ఎయిర్‌ బేస్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. 

జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును జీర్ణించుకోలేకపోతోంది పాకిస్థాన్‌. ఈ క్రమంలో అంతర్జాతీయంగా భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాలని పాకిస్థాన్‌ ప్రయత్నించినా... అవన్నీ బెడిసికొట్టాయి. దీంతో పుండు మీద కారం జల్లినట్టు ఫీలవుతున్న పాకిస్థాన్‌... ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. తమ భూభాగం నుంచి పని చేస్తున్న ఉగ్రవాదులను భారత్‌పై దాడులకు ఉసిగొల్పుతోంది పాక్‌. దీనిలో భాగంగానే హెవీ లిఫ్టింగ్‌ డ్రోన్‌ల సాయంతో  పెద్ద మొత్తంలో ఏకే 47 రైఫిళ్లు, గ్రెనేడ్లు, శాటిలైట్‌ ఫోన్లను అమృత్‌సర్‌లో తిష్టవేసిన ఉగ్రవాదులకు పంపింది పాకిస్థాన్‌. జమ్మూ-కాశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు ఈ ఆయుధాలు, శాటిలైట్‌ ఫోన్లను పంపినట్టు భావిస్తున్నారు భద్రతా అధికారులు. వారం రోజుల్లో ఒక్క ఎయిర్‌ బేస్‌పై అయినా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయాలని భావిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం. అలాగే, దేశంలోని 30 ప్రధాన నగరాల్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించాలని భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.