మోడీకి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవు: చంద్రబాబు

మోడీకి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవు: చంద్రబాబు

ప్రధాని మోడీకి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సీఎంలు చంద్రబాబు, మమతా బెనర్జీలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దుతో ప్రజలంతా నష్టపోయారని, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో మోడీ ఒక్కరే లాభపడ్డారన్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది.  మోదీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీకి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవన్నారు. రఫేల్‌‌ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. మోడీకి ప్రధాని కుర్చీ దిగే సమయం దగ్గరపడింది, ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు.

దేశంలో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. సీబీఐ, ఈడీ నిర్వీర్యం అయిపోతుంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?. ప్రధానమంత్రిని అడుగుతున్నా.. మీ డిగ్రీ ఏంటని?. మోడీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేశారు. కేజ్రీవాల్‌, అఖిలేశ్‌లను ప్రధాని అడ్డుకున్నారు. ఎందుకో చెప్పాలి? అని ప్రశ్నించారు. మోడీ పాలనలో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోయాం. అందరు విపక్ష నేతలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కానీ బీజేపీ నేతలపై మాత్రం జరగట్లేదన్నారు. దేశంలో సహకార వ్యవస్థ ఎక్కడుందని ప్రశ్నించారు. మోడీ పాలన నుంచి విముక్తి పొందేందుకే అందరం ఏకమయ్యాం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.