ఇక స్విగ్గీ, జొమాటోపై మోడీ కన్ను

ఇక స్విగ్గీ, జొమాటోపై మోడీ కన్ను

సూపర్‌ ఫాస్ట్‌గా ఎదుగుతున్న స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరి కంపెనీలతోపాటు కాయగూరలు, వంట సామగ్రి సరఫరా చేసే బిగ్‌ బాస్కెట్‌, గ్రొఫెర్స్‌ వంటి కంపెనీలకు మోడీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ద ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ ఆదేశాలు జారీ చేసింది. తిండి పదార్థాలను సరఫరా చేయడం విషయంలోనూ, వాటి నిల్వ విషయం కఠిన నిబంధనలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సంస్థ ఈ కామర్స్‌ కంపెనీలను ఆదేశించింది. ఫుడ్‌  డెలివరీ సమయంలో ఎక్కడైనా సరే... ఆపి ఆహార పదార్థాలను సేకరించి పరీక్షలకు పంపే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌ ప్రకారం.. ఫుడ్‌ ప్యాకెట్‌ తీసుకునే ఖాతాదారునికి... ఆ ఆహార పదార్థం తాజాగా ఉండటంతో పాటు కొనే ముందు అందులో ఏముంటాయో తెలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. డెలివరి తరవాత సదరు ఫుడ్‌ ఐటమ్‌ షెల్ఫ్‌ లైఫ్‌లో కనీసం 30 శాతం కాలం లేదా 45 రోజులు నిల్వ ఉండేలా చూడాలని కూడా స్పష్టం చేసింది. పైగా ఆహారం అమ్మే కంపెనీలు... తాము సరఫరా చేసే ఫుడ్‌ తాలూకు బొమ్మలు స్పష్టంగా కన్పించేలా వెబ్‌సైట్‌ లేదా పోర్టల్‌లో పెట్టాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. తాజా ఫుడ్‌ సరఫరా చేసేందుకు ప్రయత్నించాలని పేర్కొంది. ఈ పరిశ్రమలో తయారుదారులను నియంత్రించడం కష్టం కాబట్టి... ఫుడ్‌ డెలివరీ కంపెనీల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది.