రేపు శ్రీనగర్ కు రాజ్ నాథ్ సింగ్

రేపు శ్రీనగర్ కు  రాజ్ నాథ్ సింగ్

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో గురువారం సాయంత్రం అతిపెద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 27 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. మరో 45 మంది జవాన్లకు గాయాలైనట్టు చెబుతున్నారు. శ్రీనగర్-జమ్ము హైవేపై ఉన్న అవంతిపురా ప్రాంతంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లో 70 వాహనాలు ఉన్నాయి. దాడి తర్వాత దృశ్యాలు గుండెను పిండేసేలా ఉన్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడి చేసింది తామేనని ప్రకటించింది. 2004లో యురీ దాడి తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రవాద దాడిగా చెబుతున్నారు.

పుల్వామా నివాసి అయిన జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ 350 కిలోల పేలుడు సామాగ్రి నింపిన ఎస్ యువితో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లోని బస్సుని ఢీకొట్టాడు. దాడి జరిగిన కాసేపటికి విడుదల చేసిన వీడియోలో జైష్ జెండా వెనుక ఉండగా అత్యాధునిక ఆటోమెటిక్ రైఫిళ్లను చూపిస్తూ వకాస్ తను దాడి చేయబోతున్నట్టు చెప్పాడు. కశ్మీర్ ప్రజలు ఈ వీడియో క్లిప్ చూసే సమయానికి తాను స్వర్గంలో ఉంటానని అన్నాడు. తాను ఏడాది పాటు జైషే మొహమ్మద్ లో ఉగ్రవాదిగా ఉన్నానని.. ఇది కశ్మీర్ ప్రజలకు తన చివరి సందేశమన్నాడు. దక్షిణ కశ్మీర్ ప్రజలు ఎంతో కాలంగా భారత్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నారని ఇక ఉత్తర, మధ్య కశ్మీర్, జమ్ము ప్రజలు కూడా పోరాటానికి దిగాలని పిలుపునిచ్చాడు. మా మిలిటెంట్ కమాండర్లు కొందరిని చంపి మీరు మమ్మల్ని బలహీన పరచలేరని భారత బలగాలకు సవాల్ విసిరాడు. గతంలో జైష్ ఉగ్రవాదులు చేసిన పార్లమెంట్ దాడి, యురి దాడి, పఠాన్ కోట్ దాడులను ప్రస్తావించాడు.

‘పుల్వామాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడి తుచ్ఛమైనది. నేను ఈ భీకరదాడిని గట్టిగా ఖండిస్తున్నాను. మన ధైర్యవంతులైన భద్రతా సిబ్బంది త్యాగాలు వృథాగా పోరాదు. అమరుల కుటుంబాలకు అండగా యావద్దేశం భుజం భుజం కలిపి నిలుస్తుంది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి ఉగ్రవాదుల పిరికితనాన్ని చెబుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అమరులైనవారికి దేశం నివాళులర్పిస్తోందన్నారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడినవారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఉగ్రవాదులకు వారి హేయమైన చర్యకు మరచిపోలేని విధంగా గట్టిగా బుద్ధి చెబుతామని తెలిపారు.

హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన బీహార్ పర్యటన రద్దు చేసుకొని రేపు శ్రీనగర్ పర్యటనకు వెళ్తున్నారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి గురించి తెలియగానే ఆయన రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్ ఆర్ భట్నాగర్, హోమ్ శాఖ కార్యదర్శితో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ తెలిపింది.