పుతిన్‌కు మోడీ ప్రైవేట్ విందు... నేడు కీలక భేటీ
భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేడు సమావేశం కానున్న ప్రధాని నరేంద్ర మోడీ కీలక అంశాలపై చర్చించనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ చేరుకున్న పుతిన్‌కు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి రష్యా అధ్యక్షుడు నేరుగా లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడీ నివాసానికి చేరుకున్నారు. తన నివాసానికి వచ్చిన పుతిన్‌కు ఎదురువెల్లి కౌగిలించుకుని ఆహ్వానించారు భారత ప్రధాని. రాత్రి పుతిన్‌కు విందు ఇచ్చిన మోడీ... ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం, వ్యూహాత్మక అంశాలపై చర్చించారు. ఇక ‘భారత్ విచ్చేసిన పుతిన్‌కు స్వాగతం... చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా... వాటివల్ల భారత్-రష్యా మైత్రి మరింత బలపడుతుంది' అంటూ రష్యన్, ఆంగ్ల భాషల్లో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కాగా, నేడు మోడీ, పుతిన్ 19వ వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రష్యా ఆయుధ సంస్థలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో రక్షణ రంగంలో సహకారం అంశాన్ని ఇద్దరు నేతలు సమీక్షిస్తారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రధానంగా ‘ఎస్-400 ట్రయింఫ్’ క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందంపై అందరి దృష్టి ఉంది. రష్యా నుంచి ఈ ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేస్తే ఆంక్షలు తప్పవన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అణు, ఇంధన, సైబర్ భద్రత, సైనిక, వాణిజ్య, పర్యాటక, అంతరిక్ష, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలపై మోదీ, పుతిన్ చర్చించనున్నారు. ఈ భేటీ అమెరిక నిషితంగా గమనిస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)