ప్రధాని మోడీకి రూ.2.5 కోట్ల ఆస్తులు, నగదు రూ.38,750

ప్రధాని మోడీకి రూ.2.5 కోట్ల ఆస్తులు, నగదు రూ.38,750

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి నామినేషన్ వేశారు. ఇక్కడి చివరి దశలో మే 19న ఓటింగ్ జరుగుతుంది. ప్రధానమంత్రి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన మొత్తం ఆస్తి విలువ రూ.2.5 కోట్లని పేర్కొన్నారు. ప్రధాని ఆస్తుల్లో గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న ఒక రెసిడెన్షియల్ ప్లాట్, రూ.1.27 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు, రూ.38,750 నగదు ఉన్నాయని తెలిపారు. అఫిడవిట్ లో ప్రధాని మోడీ జశోదాబెన్ ను తన భార్యగా చెప్పారు. 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందినట్టు పీఎం ప్రకటించారు.

అఫిడవిట్ ప్రకారం ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం (1978) నుంచి ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1967లో గుజరాత్ బోర్డు నుంచి ఎస్ఎస్సీ పరీక్ష పాసయ్యారు. పీఎం తన చరాస్తులు రూ.1.41 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ. 1.1 కోట్లుగా చూపారు. ప్రధానమంత్రి ట్యాక్స్ సేవింగ్స్ ఇన్ఫ్రా బాండ్స్ లో రూ.20,000 పెట్టుబడులు కూడా పెట్టారు. ఇవి కాకుండా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో రూ.7.61 లక్షలు, ఎల్ఐసీ పాలసీలలో రూ.1.9 లక్షలు ఉంచారు. 

మోడీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో రూ.4,143 నగదు బ్యాలెన్స్ ఉంది. అఫిడవిట్ ప్రకారం ప్రధాని దగ్గర 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి బరువు 45 గ్రాములు, విలువ రూ.1.13 లక్షలు. ప్రధానమంత్రి అఫిడవిట్ లో తన యావదాస్తి వివరాలను బహిర్గతం చేశారు. నామినేషన్ దాఖలు చేసేటపుడు ఇలా చేయడం తప్పనిసరి.

గాంధీనగర్ లోని సెక్టార్-1లో 3,531 చదరపు అడుగుల ప్లాట్ మోడీ పేరిట ఉంది. అఫిడవిట్ మేరకు ఈ రెసిడెన్షియల్ ప్లాట్ సహా ఆస్తి విలువ రూ.1.1 కోట్లు ఉంటుంది. 'ప్రభుత్వం ఇచ్చే జీతం', 'బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీ'లను తన ఆదాయ మార్గాలుగా మోడీ పేర్కొన్నారు. తన భార్య ఆదాయ మార్గాల గురించి 'తెలియదు' అని రాశారు. ఆయన వృత్తి లేదా ఉపాధి కూడా 'తెలియదు' అని చెప్పారు.

తనపై ఎలాంటి క్రిమినల్ కేసు పెండింగ్ లో లేదని, ప్రభుత్వానికి ఎలాంటి అప్పు చెల్లించాల్సి లేదని ప్రధానమంత్రి ప్రకటించారు. వారణాసి నుంచి రెండోసారి పోటీ చేస్తున్న నరేంద్ర మోడీ 2014లో తన మొత్తం ఆస్తి విలువ రూ.1.65 కోట్లు అని చెప్పారు.