ప్రధాని మోడీ మన్‌కీబాత్.. నేను రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు..!

ప్రధాని మోడీ మన్‌కీబాత్.. నేను రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు..!

రాజకీయాల్లోకి వస్తాననుకోలేదంటు తన మనస్సులోని మాటను మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రజలతో పంచుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనుకునేవాడినని, అన్ని పాఠశాలలు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో పాఠశాలలకు ర్యాంకులు కేటాయించాలని, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు చేటుగా మారిందన్నారు మోడీ. విజ్ఞానం కోసం పుస్తకాలు వదిలి.. గూగుల్ వెతుకుతున్నారని, అంతరించిపోతున్న మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాలని ప్రజలను కోరారు ప్రధాని. మన జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉందని, ప్రకృతి బాగుంటే.. ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు.

నవంబర్‌లో వచ్చే నాల్గో ఆదివారాన్ని ఎన్‌సీసీ దినోత్సవంగా జరుపుకుంటాం.. మన యువత ఈ రోజును తప్పకుండా గుర్తుపెట్టుకోవాలన్నారు ప్రధాని మోడీ.. ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం ఎన్‌సీసీ పనిచేస్తున్నవారిని, గతంలో పనిచేసినవారికి అభినందనలు తెలిపారు మోడీ.. ఇక, నేను నా గ్రామ పాఠశాలలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉండటం నా అదృష్టం, అందుకే ఈ క్రమశిక్షణ మరియు యూనిఫాం నాకు తెలుసు, దానివల్ల విశ్వాసం పెరుగుతుందన్నారు. సాయుధ దళాల దినోత్సవం డిసెంబర్ 7న జరుపుకుంటారు. ఈ రోజు మన సైనికుల త్యాగం మరియు ధైర్యాన్ని మనం గుర్తుంచుకుంటామని వెల్లడించారు. సాయుధ దళాల ధైర్యం మరియు అంకితభావం పట్ల మన కృతజ్ఞతలు తెలియజేద్దాం అని పిలుపునిచ్చారు మోడీ. ఇక, నవంబర్ 9న అయోధ్య తీర్పు వెలువడిందని.. 130 కోట్ల మంది భారతీయులు శాంతి, ఐక్యత మరియు సామరస్యాన్ని చాటారని తెలిపారు మోడీ.